మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ
-ఎన్.ఆర్.నారాయణమూర్తి (ఇన్ఫోసిస్) - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
నారాయణమూర్తి 20 ఆగస్ట్ 1946 న మైసూర్ , కర్నాటక రాస్ట్రము లో కన్నడ మద్వ బ్రహ్మిణ్ కుటుంబము లో జన్మించారు . ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ , ఐ.ఐ.టీ లో మాస్టర్ డిగ్రీ చేసారు .
వ్యూహాలు గొప్పగా ఉండవచ్చు. లక్ష్యాలు అత్యున్నతంగా ఉండవచ్చు. జీతాలు ఆకర్షణీయంగా ఉండవచ్చు. అనుభవ సంపన్నుల అండదండలూ ఉండవచ్చు. ఏ సంస్థ మనుగడకైనా ఇవొక్కటే సరిపోవు.
'మనసు' కూడా ఉండాలి! మూడు దశాబ్దాల క్రితమే ఇన్ఫోసిస్ పేరుతో మనసున్న సాఫ్ట్‌వేర్ సంస్థను స్థాపించారు ఎన్.ఆర్.నారాయణమూర్తి. 'మానవీయ పెట్టుబడిదారి వ్యవస్థ'కు దారిచూపిన ఆ నాయకుడు ఈ శనివారం (ఆగస్టు 20) ఇన్ఫోసిస్ ఛైర్మన్ పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలగుతున్నారు.
ఇన్ఫోసిస్.నారాయణమూర్తి.--ఒక వ్యక్తి+ఒక సంస్థ= ఐటీ రంగంలో ఒక అద్భుతం.
ఆ గొప్పదనం వ్యక్తిదా, సంస్థదా? అంటే.. సంస్థలాంటి వ్యక్తిది. 'ఇన్ఫోసిస్' నారాయణమూర్తిది!
ఇన్ఫోసిస్‌ను ఆయన ఒక మామూలు సాఫ్ట్‌వేర్ కంపెనీగానో, అవుట్‌సోర్సింగ్ కేంద్రంగానో రూపొందించలేదు. ఒక వ్యవస్థగా తీర్చిదిద్దారు. అందుకు ఆయన ఎంచుకున్న మార్గాలు గణిత సిద్ధాంతాల్లా, సైన్స్ ఫార్ములాల్లా...తిరుగులేని విలువల సూత్రాలు. ఒక దేశానికి రాజ్యాంగంలా పనికొస్తాయి. ఒక వ్యక్తికి వికాస పాఠాల్లా ఉపయోగపడతాయి. వ్యాపార సంస్థలో అమలుచేస్తే, అది కలకాలం నిలుస్తుంది.
విద్యాసంస్థలో అమలు చేస్తే రేపటి పౌరులు ప్రయోజకులు అవుతారు. స్వచ్ఛంద సంస్థలో అమలుచేస్తే లక్ష్యసాధన సులువైపోతుంది. గొప్ప పుస్తకాలు, స్ఫూర్తిప్రదాతలు, విజయాలు, వైఫల్యాలు, సృజన, సమాజ పరిశీలన, నిరంతర అధ్యయనం, మిత్రబృందం... ఇన్ఫోసిస్ లీడర్‌కు అక్షౌహిణుల సైన్యంలా అండగా నిలిచిన అంశాలెన్నో, వ్యక్తులెందరో. నారాయణమూర్తి ఎవర్నీ మరచిపోలేదు. ఏ అనుభవాన్నీ మనసు పొరల్లోంచి చెరిపేసుకోలేదు. 'మూడు దశాబ్దాల జీవితంలో ఇన్ఫోసిస్ ఎన్నో విలువైన పాఠాలు నేర్పింది. ఎంతో సంపదనిచ్చింది. ఓ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఎన్.ఎస్.రాఘవన్, క్రిస్ గోపాలకృష్ణన్, నందన్ నీలేకని...ఇలాంటి సహచరులే లేకపోతే నేను లేను. ఉన్నా సున్నా. ఇంత గొప్ప విజయం, ఓ వ్యవస్థ నిర్మాణం సాధ్యమయ్యేదే కాదు' అని వినమ్రంగా చెబుతారు. ఒక స్థాయికి వెళ్లేసరికి ఏ మనిషికైనా అహం నెత్తినెక్కి కూర్చుంటుంది. ఈయనేమిటి - ఒక రుషిలా, ఒక ఫకీరులా - ఏదీ తనదికానట్టు మాట్లాడతారే? అనిపించవచ్చు.
'కర్మణ్యేవాధికారస్తే...' భగవద్గీతలో నారాయణుడి ఉవాచ, నారాయణమూర్తి ఆలోచనలకు మూలకేంద్రం. తాను తామరాకుమీద నీటి బొట్టుననే అనుకుంటారు. 'అది భౌతికమైన సంపద కావచ్చు. మేధోపరమైన సంపద కావచ్చు. మనం సృష్టించినదంతా మనది కాదు. దానికి మనం తాత్కాలికమైన సంరక్షకులం మాత్రమే. నలుగురితో పంచుకోవడం ద్వారానే దాని విలువ పెరుగుతుంది' అంటారు.
సమాజంలో తనవంతు బాధ్యత నిర్వర్తించడానికి నారాయణమూర్తి ఎంచుకున్న మార్గం...'మానవీయ పెట్టుబడిదారి వ్యవస్థ'. ఇది పెట్టుబడిదారి, సామ్యవాద వ్యవస్థల్లోని మేలు లక్షణాల కలయిక. ఎవరికివారు ధర్మబద్ధమైన మార్గంలో సంపదను పెంచుకుంటూనే, ఏదోఒక రూపంలో నలుగురితో పంచుకునే విధానం. ఆ నలుగురూ...ఉద్యోగులు కావచ్చు. వాటాదారులు కావచ్చు. ఖాతాదారులు కావచ్చు. ప్రజలు కావచ్చు. విలువల పునాదులు
పునాదుల్ని బట్టి నిర్మాణం. విలువల్ని బట్టి వ్యక్తిత్వం. ఇన్ఫోసిస్‌కు బలమైన విలువల పునాదులు వేశారు నారాయణమూర్తి. బిలియన్‌డాలర్ కంపెనీ కావాలి..నాస్‌డాక్‌లో నవోదు కావాలి...ఆస్తులు సంపాదించాలి... ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ఎక్కాలి... ఇన్ఫోసిస్ స్థాపన వెనుక ఇలాంటి ఖరీదైన కలలేం లేవు. 'ఇన్నేళ్ల తర్వాత కూడా, కొన్నికోట్లమందికి అక్షరం అందనంత దూరంలో ఉంది.
సురక్షితమైన తాగునీరు దొరకడం లేదు. వైద్యసౌకర్యాలు అంతంతమాత్రమే. మరుగుదొడ్లు కూడా కరవే'... తరహా అంతర్మథనమే ఎక్కువ. కమ్యూనిస్టు సిద్ధాంతాలూ తన భావాలూ చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించేది. ఏదో ఒకరోజు రాజకీయాల్లోకి వస్తానని చెప్పేవారు. అంతలోనే, అవకాశాల్ని వెతుక్కుంటూ పారిస్ వెళ్లిపోయారు. అక్కడ జరిగిన సంఘటన నారాయణమూర్తి నిర్ణయాన్ని మార్చేసింది. సెర్బియా బల్గేరియాల మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతంలోని ఓ రైల్వేస్టేషన్‌లో ఉన్నారప్పుడు. పారిస్ నుంచి మైసూరుకు తిరుగు ప్రయాణంలో అదో మజిలీ. రైల్లో ఓ జంట పరిచయమైంది. మాటలు కలిశాయి. తన భావాల్నీ ఆలోచనల్నీ ఆవేశంగా పంచుకుంటున్నారు. అటుగా వెళ్తున్న ఓ గార్డు నక్కినక్కి వీళ్ల మాటలు విన్నాడు. నారాయణమూర్తి బల్గేరియా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారేవో అన్న అనుమానం వచ్చింది. లాక్కెళ్లి ఇరుకిరుకు గదిలో బంధించాడు. చిమ్మచీకటి. చిన్న రంధ్రం మాత్రమే ఉంది. అదీ కాలకృత్యాలు తీర్చుకోడానికి. తిండి లేదు. నిద్రలేదు. సాయంచేసే నాథుడు లేడు. రక్తం
గడ్డకట్టుకుపోయేంత చలి. అదో నరకం. ఇరవైనాలుగు గంటల తర్వాత 'మా మిత్రదేశం...భారత్ నుంచి వచ్చావు కాబట్టి బతికిపోయావు. పాపమని వదిలేస్తున్నాం' అంటూ బరబరా బయటికి ఈడ్చి పడేశాడు.
దీంతో నారాయణమూర్తికి కమ్యూనిస్టుల మీదున్న భ్రమలన్నీ తొలగిపోయాయి. మూర్తి ఆలోచనల్ని ప్రగాఢంగా ప్రభావితం చేసిన పుస్తకాలు మూడున్నాయి...మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్ (మహాత్మాగాంధీ), ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ స్పిరిట్ ఆఫ్ కాపిటలిజం (మాక్స్ వెబర్), బ్లాక్ స్కిన్ - వైట్ మాస్క్స్ (ఫ్రంజ్ ఫానన్). గాంధీజీ విలువల గురించి చెప్పారు. 'సమున్నతమైన ఆలోచనలు, కష్టించే స్వభావం ఉన్న యువత దేశ ప్రగతికి పునాదులు' అన్న ఆలోచనకు వెబర్ మద్దతు పలికారు. ఫ్రంజ్ ఫానన్ భావాలు పాలకుల అసలు రంగును బట్టబయలు చేశాయి. వాళ్లంతా నల్లతోలు కప్పుకున్న తెల్లదొరలేనని తేల్చిచెప్పాయి. 'మరి, నిజమైన నాయకుడు ఎలా ఉంటాడు?' అని
ప్రశ్నించుకున్నప్పుడు...బోసినవ్వుల బాపూ కళ్లముందు కనిపించాడు. భారతదేశానికి రాగానే, దేశీయ అవసరాల కోసం ఓ ఐటీ సంస్థను స్థాపించారు. అప్పటికి భారత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకునే స్థాయికి ఎదగలేదు. దీంతో వ్యాపారం మూతబడింది. పాట్నీ కంప్యూటర్స్‌లో చేరారు. మంచి సంస్థ. మంచి జీతం. అన్నిటికీ మించి ఆ ఆరుగురు సహోద్యోగులు. ఏదో ఒకరోజు అత్యద్భుత విజయాలు సాధించాలన్న ఉత్సాహం వాళ్లలిో కనిపించేది. అందర్లోనూ సమాజం అంటే బాధ్యత ఉంది. విలువలంటే గౌరవం ఉంది. అలాంటి సహచరులే తోడుంటే, జీవితంలో వెనుదిరిగి చూడాల్సిన అవసరమేరాదనిపించింది. ఆ ఆరుగురికీ కూడా నారాయణమూర్తి మీద అలాంటి అభిప్రాయమే ఉంది. అంతా మంచి స్నేహితులయ్యారు. ఉమ్మడి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. నారాయణమూర్తి ఇంట్లోని ఓ చిన్నగదిలో ఇన్ఫోసిస్ ప్రాణంపోసుకుంది.
-
విలువల పునాదుల్లేని సంస్థలు 'సత్యం'లా కనుమరుగు కావడం సత్యం. విలువల పునాదుల్లేని వ్యక్తులు కేంద్ర మాజీమంత్రి రాజాలా జైలుపాలు కావడం ఖాయం. విలువల్లేని దేశాలు పాకిస్థాన్‌లా నిత్యం నెత్తురోడటం నిజంనిజం. 'మేం నమ్మిన విలువలకూ కట్టుబడిన నైతిక సూత్రాలకూ విరుద్ధంగా ఉంటే, ఎన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టునైనా తిరస్కరిస్తాం' అనాలంటే ఆ ఇన్ఫోసిస్ నాయకుడికి ఎంత ధైర్యం ఉండాలి? డబ్బు, ప్రతిష్ఠ, బ్రాండ్...ఇవేవీ లేనిరోజుల్లో కూడా నారాయణమూర్తి తాను నమ్మిన విలువలకే కట్టుబడి ఉన్నారు. అప్పట్లో ఇన్ఫోసిస్ విదేశాల నుంచి ఒక కంప్యూటర్‌ను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. సంబంధిత అధికారికి లంచం ఇస్తే, లక్షరూపాయల సుంకంతో బయటపడవచ్చు. మిగిలిన పనులూ చకచకా పూర్తయిపోతాయి. నారాయణమూర్తి లంచం ఇవ్వడానికి తిరస్కరించారు. నిబంధనల ప్రకారం పదిలక్షలు చెల్లించారు. అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న ఇన్ఫోసిస్ లాంటి సంస్థకు అది భారీ వెుత్తమే. లోటు పూడ్చుకోడానికి ఆరేళ్లు పట్టింది. 'విశ్వవ్యాప్తంగా గౌరవాన్ని పొందిన సంస్థగా ఎదగాలి' అన్నది ఇన్ఫోసిస్ విజన్ స్టేట్‌మెంట్. సిరిసంపదలతో, అధికారంతో వచ్చే గౌరవం మెరుపులాంటిది. తాత్కాలికం. మేధస్సుకే శాశ్వత గౌరవం. విలువలకే వినయపూర్వక ప్రణామాలు!
'పవర్డ్ బై ఇంటలెక్ట్...
డ్రివెన్ బై వాల్యూస్' - ఇన్ఫోసిస్ నినాదం.
మేధస్సు దిశానిర్దేశం చేస్తుంది. విలువలు ముందుండి నడిపిస్తాయి. మేధ, విలువలు ఉన్నచోటికి...విజయం దానంతట అదే వస్తుంది. విజయలక్ష్మి వెనకాలే ఘల్లుఘల్లుమంటూ ధనలక్ష్మి!
నాయకుల కార్ఖానా
ఇన్ఫోసిస్‌లో 'నేను', 'నాది', 'నా విజయం' అన్న మాట ఎక్కడా వినిపించదు, చీఫ్ మెంటార్ నుంచి సామాన్య ఉద్యోగి దాకా ఎవరూ ఉపయోగించరు. వాళ్లకు తెలిసిందల్లా 'బృంద'గానమే! ఆ సమష్ఠితత్వమే లేకపోతే ఇన్ఫోసిస్ లేదు. అక్కడ అనుచరులుండరు. అంతా నాయకులే. ముప్పైఏళ్ల క్రితం విత్తు నాటుతున్నప్పుడే ఆ లక్షణాన్ని కంపెనీ జన్యువుల్లోకి ఎక్కించారు నారాయణమూర్తి. సిబ్బందిలో నాయకత్వ లక్షణాల్ని పెంపొందించడానికి ప్రత్యేకమైన శిక్షణ సంస్థను స్థాపించారు -ఇన్ఫోసిస్ లీడర్‌షిప్ ఇన్‌స్టిట్యూట్. 'యాక్సిలరేటెడ్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్' ద్వారా నవతరం ఆలోచనలకు సానబడతారక్కడ. ప్రతి యువనాయకుడికీ ఒక సీనియర్ నాయకుడు మార్గదర్శనం చేస్తాడు. ఇన్ఫోసిస్‌ను ప్రారంభించిన తొలిరోజుల్లో...ఏ కొత్త ఆలోచన అయినా వ్యవస్థాపక సభ్యుల నుంచే వచ్చేది. సాధారణ ఉద్యోగులు, ముఖ్యంగా యువతరం పెద్దగా చొరవ చూపేవారు కాదు. చెప్పవచ్చో లేదో అన్న బిడియం కావచ్చు. తమకు అంత స్థాయి లేదేవో అన్న భయమూ కావచ్చు. నారాయణమూర్తికి ఆ సంశయం అర్థమైంది.
వ్యవస్థలోని లోపమూ తెలిసొచ్చింది. వ్యూహరచన, సంక్షోభ నివారణ, మార్పును గమనించే నైపుణ్యం, నాయకత్వ ప్రతిభ...తదితర లక్షణాల్ని ఇన్ఫోసియన్లలో పెంపొందించడం తక్షణ కర్తవ్యమని భావించారు.
ఆ నిర్ణయం వల్ల...ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే లాభపడలేదు. ఆ పరిజ్ఞానంతో...ఎంట్రప్రెన్యూర్స్‌గా అవతరించినవారు ఎంతోమంది. స్పష్టమైన ఆలోచనతో, నలుగురికీ ఉపాధి చూపించాలన్న లక్ష్యంతో సంస్థ నుంచి బయటికెళ్లేవారిని నారాయణమూర్తి మనసారా ఆశీర్వదిస్తారు. ఇన్ఫోసిస్ అంటుకొమ్మలు నలుదిశలా విస్తరించాయి. ఇన్ఫోసిస్‌కు అవతల...కళ్లనిండా కలలతో, గుండెనిండా ఆత్మవిశ్వాసంతో, ఆలోచనల నిండా అద్భుతాలతో ఆసరా కోసం అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది యువతీయువకుల మాటేమిటి? అలాంటివారి కోసమే నారాయణమూర్తి కాటమరాన్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుచేశారు. సృజనకు నిధుల కొరత ఉండకూడదన్నది ఆయన ఆలోచన. 'ఎంట్రప్రెన్యూర్‌షిప్' అనేది ఉపాధి అవకాశాల సృష్టికి, పేదరిక నిర్మూలనకు ఓ మార్గం. ఒక వ్యాపార ఆలోచనను ప్రోత్సహించడం అంటే ఒక నాయకుడిని సృష్టించడమే. నిజానికి దేశం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకు కారణం ప్రజల నిర్లిప్తతే. తమను తాము అనుచరుల్లానో బానిసల్లానో భావించుకోవడం వల్లే ఈ దుస్థితి. 'నేనో లీడర్'ని అనుకుంటే...మనం స్పందించే పద్ధతి వేరుగా ఉంటుంది. మరింత బాధ్యతాయుతంగా ఉంటుంది. మన ఆలోచనలో, ఆచరణలో అది ప్రతిబింబిస్తుంది. ఆ నాయకత్వశక్తే ఇన్ఫోసిస్‌ను మిగిలిన సంస్థల కంటే ఉన్నతంగా నిలబెట్టింది.
భవితకు భరోసా...
ఇంత చండాలమైన దేశంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం...అని ఏ దేశ ప్రజలైనా బాధపడ్డారంటే, ఇంత పనికిమాలిన కంపెనీలో ఉద్యోగం చేయడం ఏ జన్మలో చేసుకున్న పాపవో...అని ఏ సంస్థ ఉద్యోగులైనా గొణుక్కున్నారంటే...ఆ దేశం సంకోభానికి దగ్గర్లో ఉన్నట్టు, ఆ సంస్థ సమస్యల్లో చిక్కుకున్నట్టు. అన్నిటికీ మించి, అది నాయకుడి వైఫల్యం! పౌరుల్లో సిబ్బందిలో వాటాదారుల్లో ఖాతాదారుల్లో నమ్మకాన్ని నింపలేనివాడు లీడర్ అనిపించుకోలేడు. అంత నమ్మకం రాత్రికిరాత్రి పుట్టుకురాదు. పరీక్షలు నెగ్గాలి. సవాళ్లు అధిగమించాలి. రాబోయే రేపటిని ఈరోజే కళ్లముందు ఆవిష్కరించాలి. సవాళ్లొచ్చినా సంక్షోభాలొచ్చినా లీడర్ తమ వెనుక ఉంటాడన్న భరోసా ఇవ్వాలి.
ఇరవైఏళ్ల క్రితం, ఓ విదేశీ సంస్థ బిలియన్ డాలర్లో అంతకంటే కాస్త ఎక్కువో చెల్లించి ఇన్ఫోసిస్‌ను సొంతం చేసుకోడానికి ముందుకొచ్చింది. మిగతా భాగస్వాములు సంతోషంగా అంగీకరించారు. ఇక నారాయణమూర్తి వంతు. ఏ పరిస్థితుల్లో ఏ లక్ష్యాలతో ఇన్ఫోసిస్‌ను ప్రారంభించిందీ అందరికీ గుర్తుచేశారు. 'ఇన్ఫోసిస్ మన కల. మనందరి జీవితం. ఒక దశాబ్దం పాటు కంటికిరెప్పలా చూసుకున్నాం.
గ్లోబలైజేషన్ నేపథ్యంలో...ఎన్నో అవకాశాలు తలుపు తట్టబోతున్నాయి. భవిష్యత్ అంతా ఐటీదే! అయినా కూడా, అమ్మాలనుకుంటే...ఎవరి చేతుల్లోనో పెట్టడం ఎందుకు? మీ వాటాల్ని నేనే కొంటాను'... నారాయణమూర్తి మాట్లాడాక, ఎవరూ మాట్లాడలేదు. చాలాసేపు నిశ్శబ్దం. నిజానికి, ఆయన జేబులో చిల్లిగవ్వకూడా లేదు. తామంతా కలిసి కట్టుకున్న విలువల మేడ ఇంకెవరి చేతుల్లోకో వెళ్లకూడదన్న తపనే అలా మాట్లాడించింది. భాగస్వాములూ అర్థంచేసుకున్నారు. ఇంకెప్పుడూ ఎవరూ అలాంటి ప్రతిపాదన తీసుకురాలేదు. పదేళ్లలో ఆ సంస్థ మార్కెట్ విలువ బిలియన్ డాలర్ల కంటే, 28 వేలరెట్లు ఎక్కువైంది. ఇప్పుడైతే, ఇన్ఫోసిస్ షేరంటే బంగారమే! మార్చి 2010 నాటికి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఇన్ఫోసిస్‌లో వాటాలున్నాయి. వాటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.50 వేల కోట్లు.ప్రస్తుతం, లక్షా పాతికవేలమందికి పైగా ఇన్ఫోసిస్ నీడలో బతుకుతున్నారు. ప్రజల విశ్వాసాన్ని పొందినవాడు నాయకుడు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నవాడు మహానాయకుడు!
అనుభవ పాఠాలు...
వైఫల్యమంటే తెలియని సంస్థ ఏదైనా ఉందంటే, దానికి గెలుపు రుచీ తెలిసుండకపోవచ్చు! ఎదురుదెబ్బలే లేకపోతే, ఎదురుతిరిగే ధైర్యం ఎలా వస్తుంది? ఇన్ఫోసిస్‌కు అనుభవమే అసలైన పెట్టుబడి.
తొలిరోజుల్లో... పేరుప్రతిష్ఠల్లేవు. డబ్బు లేదు. బ్రాండ్ విలువలేదు. ఓ పెద్ద కంపెనీ కంప్యూటర్ల మీద రాత్రిళ్లు మాత్రమే పనిచేయడానికి ఒప్పందం చేసుకున్నారు. అతి కొద్దిమంది ఉద్యోగుల్ని నియమించుకున్నారు. అయినా, జీతాలకు కటకటే. ఆ ఇబ్బందులు చూడలేక ఓ భాగస్వామి తన దారి తాను చూసుకున్నారు. వీటన్నిటికి తోడు సర్కారీ కార్యాలయాల్లో అవినీతి. ఒక్క కంప్యూటర్‌ను దిగుమతి చేసుకోడానికి (150 శాతం దిగుమతి సుంకం చెల్లించి మరీ...) పాతికసార్లు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. టెలిఫోన్ పెట్టించుకోడానికి ఏడాది పట్టింది. ఐటీ మార్కెట్ కూడా ఏమంత గొప్పగా లేదు. ఎంతోకొంత రాబడి వస్తుందన్న ఉద్దేశంతో ఇన్ఫోసిస్ హార్డ్‌వేర్ రంగంలోకి వచ్చింది. పరిమిత వనరులతో పోటీని తట్టుకోవడం కష్టమని అర్థంకావడానికి ఎంతో సమయం పట్టలేదు. దుకాణం కట్టేశారు. ఎక్కడో భారతదేశంలో ఉన్న ఇన్ఫోసిస్ అనే కంపెనీని నమ్మి, అతి ముఖ్యమైన బాధ్యతల్ని అప్పగించడం రిస్కుతో కూడిన వ్యవహారమేవో అన్న అనుమానాన్ని తొలగించడానికి...'గ్లోబల్ డెలివరీ వోడల్'ను అభివృద్ధిచేసింది నారాయణమూర్తి బృందం. దీని ప్రకారం...70 శాతం పనులు భారత్‌లోని డెవలప్‌మెంట్ సెంటర్‌లో జరిగితే, మిగతా 30 శాతం కీలకమైన పనులు క్త్లెంట్లు ఉన్నచోటే జరుగుతాయి. భారత ఐటీ పరిశ్రమనే మలుపు తిప్పిన నిర్ణయమది. ఇన్ఫోసిస్ సున్నా నుంచి ఐదు మిలియన్ డాలర్లకు చేరుకోడానికి పదేళ్లు పడితే, అంతకంటే కాస్త తక్కువ సమయంలోనే ఐదు మిలియన్ డాలర్ల నుంచి 700 మిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఎంతోకాలంగా వ్యాపార సేవలు పొందుతున్న జి.ఇ. (జనరల్ ఎలక్ట్రికల్స్) చేజారిపోవడం ఎంతపెద్ద దెబ్బో...అంత గొప్ప పాఠం కూడా. అప్పటిదాకా దాదాపు 25 శాతం వ్యాపారాన్ని ఇస్తున్న సంస్థ..ధరల విషయంలో చిన్న తేడా రావడంతో వెనక్కి తగ్గింది. మరో ఐటీ కంపెనీ అయితే బిక్కచచ్చిపోయేది. మరో నాయకుడైతే వాటాదారులకు వెుహం చూపించలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయేవాడు. ఇన్ఫోసిస్ ఆ పని చేయలేదు. నారాయణమూర్తి వెనకడుగు వేయలేదు. నలభై ఎనిమిది గంటల్లో తమ భవిష్యత్ ప్రణాళికను ప్రకటించారు. రాబడి లోటును ఎలా పూడ్చుకునేదీ వివరించారు. ఆ పారదర్శకత ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచింది. ఇక నుంచి ఒక క్త్లెంట్ మీద కాని, ఒక దేశం మీద కాని, ఒక టెక్నాలజీ మీద కాని పూర్తిగా ఆధారపడకూడదన్న నిర్ణయానికొచ్చారు. సంస్థ నాయకత్వ బాధ్యతల విషయంలోనూ
ఆయనకు అంతే ముందుచూపు ఉంది. యాభై రెండేళ్లకే మేనేజింగ్ డైరెక్టరు పదవి నుంచి తప్పుకున్నారు. అరవై అయిదేళ్లకే ఛైర్మన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగుతున్నారు. ఎక్కడా వోహం లేదు.
పదవీ వ్యావోహం లేదు. 'వ్యాపార సంస్థ నిర్వహణ అనేది రిలే పరుగుపందెం లాంటిది. ఒకరు పరుగు ఆపగానే, మరొకరు అందుకుంటారు. మరెవరో గమ్యానికి చేరుకుంటారు. ఇంకెవరో పతకం స్వీకరిస్తారు. ఆ బృందంలో నేనూ ఒక ఆటగాడిని. నేనే సర్వస్వం కాదు'...ఎంత గొప్ప మాట. నారాయణమూర్తిలాంటి నిఖార్సైన లీడర్ మాత్రమే అనగలరీ మాట.
* * *
''ఇంతకాలం ముందుండి నడిపించారు. ఇక ముందు, ఎవరు మార్గదర్శనం చేస్తారు? ఎవరు వ్యూహ రచన చేస్తారు? ఎవరు విలువల విలువేమిటో బోధిస్తారు?''... ఇన్ఫోసిస్‌లోని ప్రతి ఉద్యోగినీ వేధిస్తున్న
ప్రశ్న.
''కొత్తగా ఆలోచిస్తున్నంత కాలం, సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నంత కాలం...ఇన్ఫోసిస్‌కు తిరుగులేదు. ఆ ప్రయత్నం ఆగిపోతే మాత్రం, తొలిపొద్దు వెలుగుల్లోని బంగారు వన్నెలా ఆ వైభవం క్రమక్రమంగా కనుమరుగైపోతుంది''
... ఒక్క ఇన్ఫోసిస్‌కే కాదు, ప్రతి సంస్థకూ, ప్రతి వ్యవస్థకూ నారాయణమూర్తి అనుభవపూర్వక సందేశం, ఆశీర్వచనం, హెచ్చరిక.
ఆమె...
సుధామూర్తి ప్రస్తావన లేకపోతే, ఆమె త్యాగాల్ని గుర్తుచేసుకోకపోతే, ఆమె ప్రోత్సాహాన్ని కొనియాడకపోతే... నారాయణమూర్తి విజయాల చరిత్ర అసంపూర్ణం, అసమగ్రం. ఇద్దరూ కన్నడిగులే. వెుదటిసారిగా పుణెలో కలుసుకున్నారు. అతను బడిపంతులు కొడుకు. గంపెడు సంతానంలో ఒకరు. ఐఐటీ కాన్పూర్ నుంచి పట్టా అందుకున్నారు. అప్పటిదాకా స్థిరమైన ఉద్యోగం లేదు. ఆమె కలవారి అమ్మాయి. అప్పటికే టెల్కో (టాటా సంస్థ)లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
అతను పుస్తక ప్రియుడు. ఆమెకూ పుస్తకాలంటే ఇష్టం. ఓ మిత్రుడు అతని దగ్గర పుస్తకాలు తీసుకుని, ఆమెకు ఇచ్చేవాడు. వెుదటి పేజీలో పేరు రాసుకోవడం నారాయణమూర్తికి అలవాటు. అలా ఆయన కంటే ఆయన పేరే సుధామూర్తికి బాగా పరిచయం. ఆతర్వాత ఏదో విందులో ఇద్దరూ కలుసుకున్నారు. మాట్లాడుకున్నారు. ముందుగా మూర్తే ప్రేమ ప్రతిపాదన చేశారు. 'నా ఎత్తు ఐదడుగులా నాలుగు అంగుళాలు. కళ్లజోడు పెట్టుకుంటాను. అందగాణ్నేం కాదు. పేద కుటుంబం నుంచి వచ్చాను. నా దగ్గర డబ్బు లేదు. సంపాదిస్తాననీ అనుకోవడం లేదు. అయినా సరే, నన్ను పెళ్లిచేసుకుంటారా?' అనడిగారు. 'కాస్త ఆలోచించుకునే అవకాశం ఇవ్వండి' అని చెప్పారు సుధ. ఆ ప్రతిపాదన కన్నవారి ముందుంచారామె. 'తాడూ బొంగరంలేని మనిషితో నీకు పెళ్లేమిటి? అసాధ్యం' తేల్చిచెప్పారు తండ్రి. 'ఎప్పటికైనా, మీ అనుమతితోనే అతన్ని పెళ్లిచేసుకుంటాను. కాదంటే, ఇలానే ఉండిపోతాను' అని బదులిచ్చారు సుధ. మూర్తి పాట్నీ కంప్యూటర్స్‌లో చేరాక...ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకున్నారు. చేతిలో పైసా
లేకపోయినా, నారాయణమూర్తి మిత్రులతో కలిసి ఇన్ఫోసిస్‌ను ప్రారంభించాలని అనుకున్నప్పుడు, సుధ మనసారా ప్రోత్సహించారు. పొదుపు చేసుకున్న పదివేల రూపాయలను ఆయన చేతిలో పెట్టారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నగలు కుదువపెట్టారు. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా... నారాయణమూర్తిని ఎప్పుడూ నిరాశపరచలేదు. 'కుటుంబం గురించి నేను ఆలోచిస్తాను. లక్ష్యం గురించి మీరు ఆలోచించండి' అని భరోసా ఇచ్చారు. ఇద్దర్లో ఎవరో ఒకరు మాత్రమే ఇన్ఫోసిస్ వ్యవహారాలు చూడాలని నారాయణమూర్తి నిర్ణయించినప్పుడు ...తనకు అన్ని అర్హతలూ ఉన్నా ఆ అవకాశం భర్తకే ఇచ్చారు. ఎందుకంటే, అది ఆయన కల! తను కుటుంబ బాధ్యతలకే పరిమితం అయ్యారు. 'ఇన్ఫోసిస్ తొలిరోజుల్లో నేను గుమస్తాని, వంటమనిషిని, ప్రోగ్రామర్‌ని, ఆయనకు సెక్రెటరీని ..' అని నవ్వుతూ చెబుతారామె. 'ఎంత త్యాగం, ఎంత త్యాగం!' అని ఎవరైనా సానుభూతి చూపితే ఆమె తట్టుకోలేరు. 'అది త్యాగం కాదు...ప్రేమ' అని సరిచేస్తారు. ఆ దంపతులకు ఒక కొడుకు, కూతురు... రోహన్, అక్షత. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మూర్తిగారిది ముచ్చటైన కుటుంబం!
source : eenadu sunday magazine
- ========================================
Visit my website - >
Dr.seshagirirao.com/