Sunday, June 27, 2010

కృష్ణమ్మాళ్ , Krushnammal









'అన్యాయం' అన్న మాట వినిపిస్తే చాలు... ఆ మసకబారినకళ్లు ఎర్రబడతాయి. తడబడే అడుగులు వడివడి అవుతాయి. వూతకర్ర ఆయుధమై లేస్తుంది. జనాలూ ఉద్యమాలే వూపిరిగా బతుకుతున్న కృష్ణమ్మాళ్‌ జీవితం సాహసాల సమాహారం. ఆ పోరాటయోధురాలికి ఎనభైనాలుగేళ్ల వయసు ఓ లెక్కే కాదు.
ఆ రోజు క్రిస్‌మస్‌.
మనుషుల కోసం పుట్టి, మనుషుల కోసం జీవించి, మనుషుల కోసం మరణించి, మళ్లీ మనుషుల కోసం బతికొచ్చిన మహనీయుని జన్మదినం. దూరంగా చర్చిలో పాస్టరు క్రీస్తుసందేశాన్ని బోధిస్తున్నాడు.

ప్రేమ...శాంతి...కరుణ. ఈ మూడు మాటల్లోనే జీసస్‌ జీవితసారమంతా ఉంది.

'మనం నిజంగా క్రీస్తు సందేశాన్ని అర్థంచేసుకున్నామా? ఆయన మార్గంలోనే నడుస్తున్నామా? నడిస్తే ఇన్ని ఘోరాలెందుకు జరుగుతాయి? మనుషులింత ఆటవికంగా ఎందుకు ప్రవర్తిస్తారు?'... ఆలోచించినకొద్దీ ఆ దుశ్చర్యను తలుచుకున్నకొద్దీ కృష్ణమ్మాళ్‌లో ఆవేశం కట్టలు తెంచుకుంది.

తంజావూరు జిల్లాలోని కిల్వెన్మణిలో నలభైనాలుగుమంది దళితుల్ని వూచకోత కోశారు. ఎంత అమానుషం!

ఒకటి...రెండు...మూడు...నలభైమూడు...

ఆ దళితులు ఏడ్చారు. కాళ్లుపట్టుకున్నారు. ప్రాణాలు తీయెుద్దని బతిమాలారు. అయినా వినలేదా కసాయి సైన్యం. భూస్వాములు పెంచిపోషించిన రాకాసి మూకలకు బలహీనుల ప్రాణాలతో ఆడుకోవడమంటే మహాసరదా!

నలభైనాలుగు...
వరుసలో చివరగా, నెలల పసికందు!
ఆకలో, అమ్మలేదన్న బెంగో...గుక్కపెట్టి ఏడుస్తోంది. ఓ రాక్షసుడు నిర్దాక్షిణ్యంగా పసిగుడ్డు గుండెల్లో పిడిబాకు దించాడు. చిన్నారి గిలగిలా తన్నుకుని ప్రాణాలు వదిలింది. అంతటితో ఆగలేదా దుర్మార్గం. అలానే, ఆ కత్తివెునని చెట్టుకొమ్మకి గుచ్చేశాడు. బిడ్డశవం బొమ్మలా వేలాడుతుంటే... అంతా పడీపడీ నవ్వారు!

పైశాచికానందానికి పరాకాష్ఠ!

కష్టానికి తగిన కూలీ అడగటమే ఆ దళితులు చేసిన నేరం. భూస్వాములు ఆగ్రహంతో వూగిపోయారు. పిశాచాల దండుతో దళితవాడ మీద దండెత్తారు.
కృష్ణమ్మాళ్‌ ఆ సమయానికి జయప్రకాశ్‌ నారాయణ్‌తో కలిసి పాదయాత్రలు చేస్తున్నారు. వూచకోత గురించి వినగానే, ఆమె పిడికిళ్లు బిగుసుకున్నాయి. ఆ అమాయకుల పరిస్థితి గుర్తొచ్చి కన్నీళ్లు పొంగుకొచ్చాయి. వెంటనే వెళ్లాలి. బాధితులకు ధైర్యం చెప్పాలి. ఆత్మవిశ్వాసం నింపాలి. పోరాడటం నేర్పాలి.

చిమ్మ చీకట్లో బయల్దేరారు. చేతిలో దీపంలేదు. తోడుగా ఎవరూ లేరు. రెండువందల కిలోమీటర్ల ప్రయాణం. రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్న రోజులు. బస్సులో ప్రయాణించారు. డొంకల దార్లో నడిచారు. ఏటికి ఎదురీదారు.
ఆ చీకటి ప్రయాణం, ఆమె జీవితయాత్రలో గొప్ప మలుపు! ఎవరో చేతులుచాచి రారమ్మని పిలుస్తున్నట్టు, ఏవో గొంతుకలు కాపాడమని వేడుకుంటున్నట్టు... ఆమె వడివడిగా అడుగులువేశారు. 'అది దేవుడిచ్చిన పిలుపు'... అంటారు కృష్ణమ్మాళ్‌ నలభైరెండేళ్ల నాటి సంఘటనను తలుచుకుని.

తరాలుగా నేలను నమ్ముకుని బతుకుతున్న నిరుపేదల నోట్లో మట్టికొడుతున్నారు భూస్వాములు. కష్టం దళితులది. పంట పెత్తందార్లది. ఎన్నితరాలని సహిస్తారు. ఎంత ఆకలని భరిస్తారు. నోరుతెరిచారు. శ్రమకు తగిన వేతనం అడిగారు. భూస్వాములు ఆ ధైర్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. వూచకోతతో కడుపుమంట చల్లార్చుకున్నారు.

దున్నేవాడికి భూమే దన్ను. ఆస్తయినా, ఆయుధమైనా, ఆత్మవిశ్వాసమైనా పిడికెడు మట్టే! 'భూస్వాముల కబంధహస్తాల నుంచి నేలతల్లికి విముక్తి కల్పించేదాకా నేను నిద్రపోను'.. కృష్ణమ్మాళ్‌ మాటలు వాళ్లకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. భూస్వాములు వూరుకుంటారా? ఆమెను బెదిరించారు. అరెస్టు చేయించారు. చంపాలని కుట్రపన్నారు. కృష్ణమ్మాళ్‌ భయపడలేదు. ఆమెది గాంధేయమార్గం. హర్తాళ్లతో నిరసన తెలిపారు. భజనలతో హితవు చెప్పారు.

ఆ పోరు హోరెత్తింది. ప్రభుత్వమే దిగొచ్చింది. పన్నెండువందల ఎకరాల దేవుడిమాన్యం దరిద్రనారాయణులకు దక్కింది. ఆ నేలను దుక్కిదున్నింది వాళ్లే. నారు పోసింది వాళ్లే. నీరు కట్టింది వాళ్లే. కృష్ణమ్మాళ్‌ చొరవతో కష్టఫలం కూడా వాళ్లదే ఇపుడు. ఆ ఉద్యమ సారథి కృష్ణమ్మాళ్‌ కూడా దళిత కుటుంబం నుంచే వచ్చారు. బాల్యంలో లెక్కలేనంత వివక్ష అనుభవించారు.

అనుభవాలే పాఠాలు
కృష్ణమ్మాళ్‌ పట్టివీరన్‌పట్టి అనే కుగ్రామంలో పుట్టారు. ఆ చిన్నారి పుస్తకాల సంచి భుజానికేసుకుని బడికెళ్తుంటే పల్లెపల్లెంతా కళ్లింతలు చేసుకుని చూసేది. ఓ ఆడపిల్ల, అదీ దళితవాడ అమ్మాయి చదువుకోవడమంటే ఓ విడ్డూరం. ఓ సాహసం. ఆ అనుమానపు చూపులమధ్య, ఆ అవమానపు మాటలమధ్య... కృష్ణమ్మాళ్‌ చదువులు కొనసాగించింది. బాల్యంలోనే తండ్రిపోయాడు. ఉన్నప్పుడూ కుటుంబాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. మద్యానికి కట్టుబానిసై, తాగితాగి చచ్చిపోయాడు. బాధ్యతంతా అమ్మ నాగమ్మాళ్‌దే. పన్నెండుమంది పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఏడుగురు బతికి బట్టకట్టారు. వారిలో కృష్ణమ్మాళ్‌ ఒకరు. ఆ తల్లికి విశ్రాంతి తెలియదు. అలసట తెలియదు. తెల్లారేలోపు పనికెళ్లిపోయేది. చీకటిపడ్డాక చెమటలు కక్కుతూ తిరిగొచ్చేది. అంతమంది పిల్లలకు వండివార్చి తినిపించేసరికి అర్ధరాత్రి దాటేది. అంతకష్టపడినా అర్ధాకలే. భూస్వాములు ఇచ్చే చాలీచాలని కూలీతో సర్దుకుపోవాలి. కొన్నిసార్లు అదీ లేదు. ఎదురుతిరిగే ధైర్యం ఎవరికీ లేదు.
అట్టడుగు జాతి. అందులోనూ మహిళ. సమాజంలో ఎన్ని అవమానాలు భరించాలో అన్నీ భరించారు కృష్ణమ్మాళ్‌. చెప్పులు వేసుకోడానికి వీల్లేదు. మంచినీళ్ల బావిని తాకడానికి వీల్లేదు. అగ్రవర్ణాల వీధిలో తలెత్తుకు తిరగడానికి వీల్లేదు. ఈడుపిల్లలతో ఆడుకోడానికి వీల్లేదు. ఆ దుర్భర పేదరికం, నికృష్టమైన సామాజిక పరిస్థితులు...కృష్ణమ్మాళ్‌కు జీవితమంటే ఏమిటో నేర్పాయి.
సొంతూళ్లో ప్రాథమిక పాఠశాలవరకే ఉంది. పైచదువులకు మధురై వెళ్లాలి. ఆడపిల్లని అంతదూరం ఎలా పంపిస్తారు. పంపినా, చదివించే స్థోమత ఉండొద్దూ! అన్నయ్య ప్రోత్సహించాడు. 'చెల్లీ! నీకు తోడుగా నేనుంటా' అని ధైర్యం చెప్పాడు. ఆమాత్రం బాసట చాలు. తను దూసుకుపోగలదు. ఆ వూళ్లో పెద్దచదువులకు పట్నందాకా వెళ్లిన తొలిదళిత బాలిక కృష్ణమ్మాళే! ఆమె చదువుతున్న స్కూల్లో ఓ టీచరు సాహిత్య ప్రియుడు. ఆమెకు గొప్పగొప్ప తమిళ గ్రంథాలను పరిచయం చేశాడు. ప్రపంచాన్ని చూడ్డానికి అక్షరాన్ని మించిన గవాక్షం ఏముంటుంది? 'చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. అమ్మ కష్టం తప్పించాలి... అనుకునేదాన్ని. గొప్పగొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలూ ఆత్మకథలూ చదివేకొద్దీ నా ఆలోచన మరింత విశాలమైంది. దున్నుకోడానికి జానెడు భూమి, తలదాచుకోడానికి కాసింత జాగా లేని ఎంతోమంది అమ్మలు నా కళ్లముందు కనిపించారు. వాళ్ల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నది నా ఆశయమైంది'... ఒక సాధారణ బాలిక, ఉద్యమనేతగా ఎదగడానికి ఈ ఆలోచనలే బీజం వేశాయి.

కృష్ణమ్మాళ్‌ వ్యక్తిత్వం మీదా నిరాడంబరమైన జీవనశైలి మీదా మడమతిప్పని సిద్ధాంతశక్తి మీదా ప్రభావం చూపిన వ్యక్తులు చాలామందే ఉన్నారు. తమిళకవి రామలింగ వల్లలార్‌ బోధనలు ఆమెకు మానవతా పాఠాలు నేర్పాయి. పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన సుందర రామచంద్రన్‌ అమ్మలా అభిమానించారు. కృష్ణమ్మాళ్‌లోని ఆత్మవిశ్వాసం ఆమెకు బాగా నచ్చింది. ఓసారి ప్రార్థన సమావేశంలో మహాత్ముడి పక్కనే కూర్చున్న కృష్ణమ్మాళ్‌ను చూపిస్తూ 'ఆ అమ్మాయి ఎవరు?' అనడిగారట రాజాజీ. 'నా కూతురే..' అని చెప్పారు సుందర రామచంద్రన్‌. అంత ప్రేమ! పైచదువుల ఖర్చంతా తనే భరించారు.

మహాత్ముడి మాటలూ జీవనవిధానమూ కృష్ణమ్మాళ్‌ను ఎంతగా ప్రభావితం చేశాయంటే, ఆ మరుక్షణం నుంచే గాంధేయవాదిగా మారిపోయారు. మహాత్ముడు కోరుకున్న గ్రామస్వరాజ్యం రావాలంటే, దున్నేవాడిదే భూమి కావాలి. నేల ఒకరిదీ, శ్రమ ఒకరిదీ అయితే...అది రామరాజ్యం అనిపించుకోదని ఆమె అభిప్రాయం. భూమి విషయంలో తన భావాలకూ వినోబా ఆలోచనలకూ సారూప్యం ఉన్నట్టు అనిపించేది. అందుకే, తొలిపరిచయంలోనే శిష్యురాలు అయ్యారు. చదువైపోగానే భూదానోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడే, జగన్నాథన్‌ పరిచయం. ఆమె జీవితం మీద భర్తగానే కాదు, తోటి ఉద్యమనేతగా కూడా ఆయన ప్రభావం ఉంది. జగన్నాథన్‌ మహాత్ముని సహాయనిరాకరణోద్యమం స్ఫూర్తితో కాలేజీ మానేశారు. 'క్విట్‌ ఇండియా' సమయంలో మూడున్నరేళ్లు జైలులో ఉన్నారు. ఇద్దరివీ వేరువేరు నేపథ్యాలు. ఆయనది అగ్రవర్ణం. ఆమె దళిత మహిళ. అతను సంపన్నుడు. ఆమె నిరుపేద. స్నేహం బలపడటానికి ఆ తేడాలేం అడ్డుకాలేదు. ముందుగా పెళ్లిప్రస్తావన తెచ్చింది జగన్నాథనే. కృష్ణమ్మాళ్‌కు ఆయనంటే అపారమైన గౌరవం. పెళ్లి ఆలోచన మాత్రం లేదు. పెద్దల మాటకు విలువిచ్చి సరేనన్నారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు... భూమికుమారి, సత్యాగ్రహ. 'మేం మీకు ఆస్తిపాస్తులేం ఇవ్వలేం. కానీ ప్రపంచమంతా బంధువుల్నిస్తాం. ఆత్మీయుల్ని సంపాదించిపెడతాం' అని చెప్పేవారు కృష్ణమ్మాళ్‌ తన పిల్లలకి. కాపురానికి అడుగుపెట్టిన రోజే రామచంద్రన్‌ ఆమెకో మాట చెప్పారు... 'మనకు ఇళ్లూ ఆస్తులూ వద్దు. ఖరీదైన గృహోపకరణాలూ వద్దు. మట్టి పాత్రలు చాలు. ఆ జంజాటాలేవీ లేకపోతేనే మనం నిమిషాల్లో బయల్దేరి ఎక్కడికైనా వెళ్లగలం. పేదలకు సాయం చేయగలం'. కృష్ణమ్మాళ్‌ మనసులోని మాట కూడా అదే.
స్వాతంత్య్రం వచ్చాక, ఇద్దరూ వినోబా భూదానోద్యమంలో పాల్గొన్నారు. పద్నాలుగేళ్ల పాటూ దేశమంతా తిరిగారు. సత్యాగ్రహాలు చేశారు. ఆ ఉద్యమ ఫలితంగా వేల ఎకరాల భూమి పేదల చేతికి వచ్చింది. కిల్వెన్మణి దళితుల వూచకోత సంఘటనతో...కృష్ణమ్మాళ్‌ ఆ ప్రాంతాన్ని తన ఉద్యమ కేంద్రంగా మలుచుకున్నారు. అలా అని ఆ ఒక్క చోటికే పరిమితం కాలేదు. ఎక్కడ తన అవసరం ఉన్నా.. రెక్కలు కట్టుకుని వాలేవారు.
జయప్రకాశ్‌ నారాయణ్‌ 'పరిపూర్ణ విప్లవం'లోనూ పాల్గొన్నారామె. బుద్ధగయ మఠానికి చెందిన రెండువేల నాలుగువందల ఎకరాల భూమి మహంతుల చేతుల్లో చిక్కుకుంది. అక్కడ లైంగిక దోపిడీ కూడా జరుగుతున్నట్టు కృష్ణమ్మాళ్‌ దృష్టికి వచ్చింది. మహంతుల అరాచకానికి అడ్డుకట్ట వేయాలంటే ముందుగా మహిళల్ని సంఘటితం చేయాలి. ఆ పనే చేశారామె. ఆతర్వాత దీక్షలు ప్రారంభించారు. తొలిరోజే ఉద్యమకారుల మీద రాళ్ల వర్షం కురిసింది. జయప్రకాశ్‌ నారాయణ్‌నూ వదల్లేదు. పోలీసులు కృష్ణమ్మాళ్‌ మీద తప్పుడు కేసులు బనాయించి, అరెస్టు చేయడానికి వచ్చారు. ఆమె ఎలాగోలా తప్పించుకున్నారు. ఆ సమయంలో జేపీ ఉద్యమాన్ని కొనసాగించారు. సమస్య సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఆ భూముల్ని నిరుపేదలకు పంచాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. భూమి కోసం జరిగినా, భుక్తి కోసం జరిగినా...ఏ ఉద్యమాన్నయినా ఆమె ప్రజాభాగస్వామ్యంతోనే నిర్వహించారు. ప్రజాచైతన్యమే ముఖ్యమని భావించారు.

లాఫ్టీ బాసట...
పండినా పండకపోయినా భూమి భూమే. ఎంతోకొంత డబ్బు చెల్లించకపోతే భూస్వామి మాత్రం ఎందుకు వదులుకుంటాడు? వదులుకున్నా అది ఎందుకూ పనికిరాని చౌడునేల కావచ్చు. వినోబా ఉద్యమంలో ఎదురైన అనుభవాలు ఆమెకు బాగా గుర్తున్నాయి. అందుకే కృష్ణమ్మాళ్‌...భూస్వామినీ భూమిలేని నిరుపేదల్నీ ఒకచోటికి రప్పించి, గిట్టుబాటు ధర నిర్ణయించే ప్రయత్నం చేయాలనుకున్నారు. ఆ లక్ష్యంతో ప్రారంభించిన సంస్థే లాఫ్టీ (లాండ్‌ ఫర్‌ ద టిల్లర్స్‌ ఫ్రీడమ్‌). నాగపట్నం జిల్లాలోని కుత్తూర్‌ కేంద్రంగా పనిచేస్తోంది. భూములు కొనుగోలు చేయడానికి లాఫ్టీ బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తుంది. పంట చేతికొచ్చాక రైతులు వాయిదాల్లో తీరుస్తారు. ఏ తాగుడుకో బానిసైపోయి వ్యసనాల కోసం కుదువపెట్టకుండా...భూమిని మహిళల పేరిట రాస్తారు. ఆ ప్రయత్నంలో కృష్ణమ్మాళ్‌ చాలా అవరోధాలు ఎదుర్కొన్నారు. అప్పులివ్వడం కుదరదని బ్యాంకులు చేతులెత్తేశాయి. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తడిసి వోపెడయ్యేవి. దీంతో బడుగురైతు భయపడిపోయాడు. కృష్ణమ్మాళ్‌ గాంధేయ మార్గంలిో ప్రభుత్వాన్ని కదిలించారు. రిజిస్ట్రేషన్‌ ఖర్చులు చాలావరకు తగ్గాయి. బ్యాంకులు కూడా దారికొచ్చాయి. ఈ ముప్ఫై ఏళ్లలో దళిత మహిళలు దాదాపు పదమూడు వేల ఎకరాలకు యజమానులయ్యారు. మరో పదకొండువేల ఎకరాలు వారి సొంతం కాబోతున్నాయి. నిరుపేద దళితులు బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించలేరన్న అధికారుల అంచనాలు తారుమారు అయ్యాయి. నూటికి నూరుశాతంమంది స్వచ్ఛందంగా రుణాలు తీర్చేశారు. సాక్షాత్తు సర్వోదయ మిత్రులే ఉద్యమం హింసామార్గం పడుతుందేవో అని భయపడ్డారు. కృష్ణమ్మాళ్‌ ఎక్కడా ఆ అవకాశం ఇవ్వలేదు. వామపక్షవాదుల తుపాకీ వోతలకు కూడా భయపడని భూస్వాములు, కృష్ణమ్మాళ్‌ అహింసా మార్గానికి తలవంచారు.

లాఫ్టీ సామాజిక సేవలోనూ ముందుంది. గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. కార్పెట్‌ తయారీ, చాపల అల్లకం వంటి చేతిపనుల్లో దళితులకు శిక్షణ ఇస్తోంది. కంప్యూటర్‌ కోర్సుల్లో తరగతులు నిర్వహిస్తోంది. వల్లివలన్‌లో మూడు హాస్టళ్లు నడుపుతోంది. అక్కడ చదువుకున్న విద్యార్థులు డాక్టర్లూ ఇంజినీర్లూ అవుతున్నారు. కరవులు, తుపాన్లు వంటి ప్రకృతి బీభత్సాలు ఎదురైనప్పుడు ప్రజలకు అండగా నిలబడుతోంది. 'ఫ్రెండ్స్‌ ఆఫ్‌ లాఫ్టీ' పేరుతో ఏర్పాటైన శ్రేయోభిలాషుల సంఘంలో ప్రపంచ వ్యాప్తంగా సభ్యులున్నారు. వాళ్లంతా కృష్ణమ్మళ్‌ ఉద్యమానికి వూతంగా నిలుస్తున్నారు. కృష్ణమ్మాళ్‌ సముద్రాన్ని కలుషితం చేస్తున్న బహుళజాతి సంస్థల మీద కూడా యుద్ధం ప్రకటించారు. ఓసారి పెత్తందార్లు పురమాయించిన కిరాయి హంతకులు ఆమె ఒంటిమీద కిరోసిన్‌పోసి తగులబెట్టాలని చూశారు. 'మీరేం చేస్తారో చేసుకోండి...' అని హూంకరించి, యోగముద్రలోకి వెళ్లిపోయారామె. అగ్గిపుల్ల వెలిగించడానికి కూడా వాళ్లకు ధైర్యం చాల్లేదు. తోకముడుచుకుని వెళ్లిపోయారు.

అందరికీ ఇళ్లు!
ఏ అవార్డు అందుకోడానికి వెళ్లినా ఏ అంతర్జాతీయ సదస్సుకు హాజరైనా ఆమె చేతిలో ఓ ఇటుక ఉంటుంది. అందరికీ ఆ కథేమిటో చెబుతారు. వూరిచివర పూరిగుడిసెల కష్టాలు వివరిస్తారు. కృష్ణమ్మాళ్‌ బాల్యం అలాంటి పాకలోనే గడిచింది. వానాకాలం వస్తే ఇల్లంతా జల్లెడవుతుంది. తలదాచుకోడానికి చోటుండదు. పెనుదుమారం రేగిందంటే పైకప్పు గాలిపటమై ఎగిరిపోతుంది. నిరుపేద బతుకులు వీధులపాలు అవుతాయి. వేసవిలో అయితే అగ్నిప్రమాదాల భయం. తేడావస్తే, వాడవాడంతా బూడిదైపోతుంది. అసలా ఇరుకిరుకు జీవితమే నరకం. హుందాగా భద్రంగా బతకడానికి ప్రతి దళిత కుటుంబానికీ ఓ ఇల్లంటూ అవసరం. అందుకే, కృష్ణమ్మాళ్‌ వూరిచివరి బతుకులకు వెచ్చని నీడ అందించే ప్రయత్నం వెుదలుపెట్టారు. నిజానికి ఆ నిరుపేదలు పూరిపాకలు వేసుకున్న జానెడు జాగా కూడా వాళ్లది కాదు. ఏ సర్కారు భూవో అయి ఉంటుంది. పెత్తందార్లకు ఆగ్రహం వస్తే ఆ కాస్త నీడా చేజారిపోతుంది. బుల్‌డోజర్లు గుండెల మీద నుంచి వెళ్తాయి. కృష్ణమ్మాళ్‌ చొరవతో.. దళితులు గుడిసెలు వేసుకున్న స్థలాల మీద వారికే హక్కులు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇళ్లు కట్టుకోవడమే తరువాయి. అందుకు అవసరమైన ఇటుకల తయారీకి కుత్తూర్‌లో ఓ కార్ఖానా ప్రారంభించారు. చమురు, సహజవాయువుల సంస్థ(వోఎన్‌జీసీ) యంత్రాల్ని ఇచ్చింది. మరో ప్రభుత్వరంగ సంస్థ ఇటుకల తయారీకి పారిశ్రామిక వ్యర్థాల్ని ఇవ్వడానికి ముందుకొచ్చింది. దాంతోనే పర్యావరణానికి నష్టంకాని పద్ధతుల్లో అక్కడ ఇటుకలు తయారుచేస్తున్నారు. తొలి ఇటుక...పెనుమార్పుకు సూచిక! అందుకే కృష్ణమ్మాళ్‌ దాన్ని అందరికీ చూపిస్తారు.

గృహనిర్మాణంలో ఇంటికొకరు పాలుపంచుకుంటారు. 'ప్రతి మహిళకూ ఓ ఇల్లు ఉండాలన్నది నా లక్ష్యం. ఇప్పటికే రెండువేల గృహాలు సిద్ధమైపోయాయి. ఇంకో ఐదువేలు నిర్మించబోతున్నాం'...కృష్ణమ్మాళ్‌ కల నిజం కాబోతుంది. ప్రత్యామ్నాయ నోబెల్‌గా పేరున్న 'రైట్‌ లైవ్‌లీహుడ్‌ అవార్డు' విజేతగా మూడులక్షల అమెరికన్‌ డాలర్లలో తనవాటా వెుత్తాన్ని కూడా ఆమె గృహనిర్మాణాలకే కేటాయించారు. త్వరలో తంజావూరు, తిరువారూర్‌, నాగపట్నం జిల్లాల్లో దళితవాడల రూపురేఖలు మారిపోతున్నాయి.
* * *
మూడేళ్ల క్రితం జరిగిందీ సంఘటన.
కిల్వెన్మణి ఘోరకలికి కారణమైన భూస్వాముల కుటుంబం వెండిపళ్లెంలో పళ్లూపూలూ ఇంకేవో కాయితాలూ పెట్టుకుని అమ్మ దర్శనానికి వచ్చింది. కృష్ణమ్మాళ్‌ తమ వెుహం చూడటానికి కూడా ఇష్టపడరేవో అని వాళ్ల అనుమానం. భయంభయంగా ఆమె గదిలోకి వెళ్లారు. 'అమ్మా! ప్రాయశ్చిత్తం అనుకోండి. పశ్చాత్తాపం అనుకోండి. మా వంతుగా మీ ఉద్యమానికి ఎంతోకొంత సాయం చేద్దామని అనుకుంటున్నాం. దయచేసి, కాదనకండి'... అంటూ పాదాల దగ్గర వాలిపోయారు. తమ ఆస్తుల తాలూకు పత్రాలు చేతుల్లో పెట్టారు. అందులో ఓ బంగళాకు సంబంధించిన పత్రాలూ ఉన్నాయి. 'ఏమీ అనుకోకపోతే ఓ చిన్న మనవి. ఈ ఇంట్లో మీరే ఉంటే మేమంతా చాలా సంతోషిస్తాం' అని అభ్యర్థించాడో భూస్వామి.
అమ్మ చిరునవ్వుతో జవాబిచ్చారు... 'నా ప్రపంచం చాలా పెద్దది. నాలుగు గోడలకే పరిమితం కావడం నాకిష్టం లేదు. అయినా, నాకు ఇంతపెద్ద బంగళా ఎందుకు? ఎక్కడ నా అవసరం ఉంటే అక్కడే ఉంటాను. ఆ జానెడు జాగా చాలు. అదే నా ఇల్లు'.
జగమంత కుటుంబం ఆమెది.
అమ్మ మనసు
''తొలిపొద్దే నా గురువు. తొలిపొద్దే నా దైవం. తెల్లవారుజామున నాలుగింటికే లేవడం నాకు అలవాటు. కాసేపు ఆకాశంవైపు చూస్తూ కూర్చుంటాను. నా మనసులో పేరుకుపోయిన సందేహాల్ని ఎవరో శుభ్రంగా కడిగేస్తున్న భావన కలుగుతుంది. ఆరోజుకు అవసరమైన శక్తి నాకు అందేది అప్పుడే.''

''ఈ పూట ఏ ఒక్కరు ఆకలితో పడుకున్నా ఈ సృష్టికి అర్థంలేదు. మానవత్వానికి అర్థంలేదు.
...సుబ్రహ్మణ్యభారతి కవిత్వం నాకెంతో స్ఫూర్తినిచ్చింది. మిత్రులారా! రండి...మనమంతా ఒక్కటై ఆకలిని గెలుద్దాం. పేదరికాన్ని గెలుద్దాం.

''నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అయినా కోట్ల రూపాయల విలువైన కార్యక్రమాలు ప్రారంభిస్తాను. నా మీద నాకున్న నమ్మకం, అంతకుమించి కరుణాసముద్రుడైన దేవుడిమీదున్న నమ్మకం... నన్ను ముందుకు నడిపిస్తోంది.''

''మహాత్మాగాంధీ, వినోబా భావే, జయప్రకాశ్‌ నారాయణ్‌... నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఈ ముగ్గురూ. వినోబా ప్రభావం మరీ ఎక్కువ. ఆయనో మహర్షి. పేరు గురించి ప్రచారం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నిత్యం పేదల మధ్యే గడిపేవారు. పేదల గురించే ఆలోచించేవారు. ఏకాస్త తీరిక ఉన్నా ప్రార్థనలో లీనమైపోయేవారు.''

''ఈ విజయాలూ అవార్డులూ నాకు దారిచూపిన మహాత్ములకు నివాళుల్లాంటివి. పర్యావరణ సమస్యలకూ, జాతులూ మతాలపేరిట జరుగుతున్న మారణహోమాలకూ గాంధీజీ, మార్టిన్‌ లూథర్‌కింగ్‌, మదర్‌థెరిసా, మండేలా వంటి మహానుభావుల బోధనల్లో పరిష్కారం ఉంది. చిత్తశుద్ధితో అనుసరించడం మన కర్తవ్యం.''

''దేవుడు ఈ భూమి మీదికి పంపింది మన బతుకు మనం బతకడానికి మాత్రమే కాదు. మన పొట్ట మనం నింపుకోడానికి మాత్రమే కాదు. నలుగురికీ సాయం చేయడానికి. మనకు ఉన్నదే పదివేలు. దాన్నే అందరితో పంచుకుందాం.''
పోచంపల్లిలో...
వినోబాభావే.. వెనకాలే జగన్నాథన్‌... ఆయన వెనక కృష్ణమ్మాళ్‌.
వినోబా అనుచరులుగా ఆ దంపతులు దేశమంతా తిరిగారు. కొన్నివేల మైళ్లు పాదయాత్రలు చేశారు. అందులో భాగంగా హైదరాబాద్‌ కూడా వచ్చారు. దాదాపు మూడువందల మైళ్ల ప్రయాణం! 1951లో సర్వోదయ వార్షిక సమావేశం హైదరాబాద్‌ శివార్లలోని శివరాంపల్లిలో జరిగింది. కమ్యూనిస్టు ఉద్యమాలు, రజాకర్ల గొడవలతో రక్తసిక్తమైన తెలంగాణ ప్రాంతంలో శాంతిసందేశాన్ని వినిపించాలని వినోబా ఆలోచన. ఏప్రిల్‌ 18న ఆయన నల్గొండ జిల్లాలో కాలువోపారు. నిర్వాహకులు పోచంపల్లిలో బస ఏర్పాటు చేశారు. ఆయన నేరుగా దళితవాడకు వెళ్లారు. కనీస వసతుల్లేని పరిస్థితులు. అంతా జానెడు భూమైనా లేని నిరుపేదలే. 'మాకూ కాస్త భూమి ఉంటే, మా జీవితాలు ఇలా తెల్లారేవి కాదు' అని బాధపడ్డారు అక్కడి జనం. 'భూమి మాత్రమే వాళ్ల జీవితాల్ని మార్చగలదు. ఆ పేదలకు అవసరమైన పొలం ఇవ్వడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా?' ... ప్రార్థన సమావేశంలో గ్రామస్థుల్ని ప్రశ్నించారు వినోబా. 'నేనున్నాను. వంద ఎకరాలు ఇవ్వడానికి సిద్ధం' .. రామచంద్రారెడ్డి అనే భూస్వామి ప్రకటించారు. ఆ వితరణ వినోబాలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. భారతదేశంలో భూసమస్యకు ఓ పరిష్కారం దొరికింది.
ఆ సంఘటన భూదాన ఉద్యమానికి నాంది పలికింది. పరోక్షంగా కృష్ణమ్మాళ్‌ జీవితానికీ దిశానిర్దేశం చేసింది.

మూలము : ఈనాడు .

  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com