Saturday, December 25, 2010

డాక్టర్‌ కొట్నీస్‌ జయంతి, Dr.Kotnis Birth day


డాక్టర్‌ కొట్నీస్‌ జయంతి-1910 అక్టోబరు10న

వైద్య విద్య ముగించుకొని మరింత ఉన్నత చదువుల కోసం తహతహలాడిన ఒక సాధారణ మధ్యతరగతి భారతీయ యువకుడు ఏవిధంగా ఒక చైనా సమాజపు జానపద కథానాయకుడి స్థాయికి చేరుకున్నాడు? ఈ ప్రశ్నకు జవాబే డాక్టర్‌ ద్వారకానాథ్‌ శాంతారామ్‌ కొట్నీస్‌ జీవితం. ఆయన జీవించింది 32 సంవత్సరాలు. చైనాలో వైద్యసేవలు అందించింది ఐదేళ్లు. కానీ, ఇప్పటికీ చైనా ప్రజలకు ఆయన ఖాచీ హువా. అంటే చైనా 'సద్గుణ దాముడు' అని . గొప్ప అంతర్జాతీయ సంఘీభావానికి, రెండు ప్రాచీన నాగరికతల మధ్య స్నేహానికి డాక్టర్‌ కొట్నీస్‌ జీవితం ఒక ప్రతీక. రేపటికి (అక్టోబరు10 నాటికి) ఆయన పుట్టి వందేళ్లు అవుతోంది. 1910 అక్టోబరు10న మహారాష్ట్ర, షోలాపూర్‌లో ఒక మధ్యతరగతి గుమస్తా కుటుంబంలో ఏడుగురి బిడ్డలలో రెండవవాడిగా కొట్నీిస్‌ జన్మించాడు.సామ్రాజ్యవాదుల చెరనుంచి విముక్తికోసం భారత,చైనాలు రెండూ వివిధ నేపథ్యాలలో పోరాటాలు చేస్తున్న రోజులవి. రెండవ ప్రపంచయుద్ధానికి ముందు కాలం. జపాన్‌ దురాక్రమణనె దుర్కొంటూ, కనీవినీ ఎరుగని మానవ విషాదాలతో చైనా తల్లడిల్లుతున్న కాలమది. చైనా కమ్యూనిస్టు సేనాని జనరల్‌ ఛూటే, భారత సహాయాన్ని అర్థిస్తూ నెహ్రూకు ఒక ఉత్తరం రాశాడు.

సుభాష్‌ చంద్రబోస్‌ అధ్యక్షతన ఉన్న కాంగ్రెస్‌ ఆ ఉత్తరానికి స్పందించి ఒక వైద్య బృందాన్ని చైనాకు పంపాలని నిశ్చయించి ఒక ప్రకటన చేసింది. అప్పుడే 1936లో వైద్య పట్టా తీసుకున్న కొట్నీస్‌కు పరిపరి ఆలోచనలు ఉన్నాయి. సర్జరీలో గొప్ప ప్రావీణ్యం సంపాదించాలని ఉండేది. అందుకోసం ఎడింబరో పోవాలా? బొంబాయిలోనే చదవాలా? ఇందుకోసం డబ్బులు ఎలా సర్దుబాటు చేసుకోవాలి? లేదా ప్రాక్టీస్‌ పెట్టి స్థిరపడి పెళ్లి చేసుకోవాలా? ఇవీ 26ఏళ్ల ఆ యువ వైద్యుడి ఆలోచనలు. కానీ, ఏ చారిత్రక శక్తుల ప్రభావం వల్లనో కొట్నీిస్‌ చైనా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఐదుగురి వైద్యుల బృందం ఎంపికైతే అందులో అతి పిన్నవయస్కుడు కొట్నీస్‌. స్పెయిన్‌ అంతర్యుద్ధంలో వైద్యసేవలు అందించిన డాక్టర్‌ మోహన్‌లాల్‌ అటల్‌ ఈ బృంద నాయకుడు. నాగపూర్‌లో ప్రఖ్యాత సర్జన్‌గా ఉన్న 60సంవత్సరాల డాక్టర్‌ ఎంఆర్‌ చోల్కర్‌ ఉపనాయకుడు. డాక్టర్‌ దేవేన్‌ ముఖర్జీ, డాక్టర్‌ విజరుకుమార్‌ బసు, డాక్టర్‌ కొట్నీస్‌ ఈ బృందంలో సభ్యులు. భారత, చైనా దేశాలు దాస్య బంధనాలు తెంచుకునే వరకూ పోరాటం ఆపేది లేదని బ్రిటీష్‌, జపాన్‌ దేశాలను హెచ్చరిస్తూ శ్రీమతి సరోజిని నాయుడు వీడ్కోలు ప్రసంగం చేసిన తరువాత అంటే 1938 సెప్టెంబరు1న డాక్టర్‌ కొట్నీిస్‌ బృందం బొంబాయి నుంచి సముద్రయానం ద్వారా చైనాకు బయల్దేరింది. డాక్టర్‌ కొట్నీస్‌కు అది తిరిగి వెనక్కురాని ప్రయాణం.

భారతీయ వైద్య బృందం-మహా ప్రయాణం

డాక్టర్‌ అటల్‌ నాయకత్వంలోని కొట్నీస్‌ బృందం కాంటన్‌ చేరుకొన్నారు. రెండు ఆంబులెన్స్‌లు, ఒక సంవత్సరానికి సరిపడా మందులు, 60 పెట్టెల నిండా సర్జరీ పరికరాలు, ఒక పోర్టబుల్‌ ఎక్స్‌రే వారు వెంట తెచ్చుకున్నారు. కాంటన్‌లో చైనా నిర్మాత, సతీమణి మదామ్‌ సన్‌ఎట్‌సేన్‌ ఈ భారత వైద్య బృందానికి స్వాగతం పలికారు. కాంటన్‌లో తొలిసారిగా చూసిన యుద్ధ బీభత్స దృశ్యాలు వారిని కలచివేశాయి. బాంబుల దాడిలో గాయపడ్డ వేలాది మంది స్త్రీ, పురుషులు, బాలబాలికల హాహాకారాలు, రాత్రనక, పగలనక నిర్విరామంగా వైద్యసేవల్లో తలమునకలైన కొద్దిమంది డాక్టర్లు. ఇవీ కాంటన్‌ దృశ్యాలు. చైనాకు ఆ పరిస్థితుల్లో 5వేల మంది డాక్టర్లు అవసరం ఉంది. కానీ, 2వేల మంది మాత్రమే పట్టభద్రులైన డాక్టర్లు ఉన్నారు. వీరిలో ఒక వెయ్యి మంది మాత్రమే యుద్ధరంగంలో పనిచేస్తున్నారు. ఇంత తీవ్రమైన వైద్యుల కొరత మధ్య భారతీయ వైద్య బృందం తాము నిర్వహించాల్సిన మానవీయ పాత్రను బేరీజు వేసుకుంది. కాంటన్‌ నుండి హాంకో, అటునుండి ఇచాంగ్‌, చుంగ్‌కింగ్‌, చివరిలో యానాన్‌... ఇదీ వైద్య బృందం చేపట్టిన ప్రయాణ మార్గం.

ఇవన్నీ మహా నగరాలే. జపాన్‌ సైన్యం వైమానిక దాడితో బాంబుల విధ్వంసంతో ఒక నగరం తరువాత మరో నగరాన్ని ఆక్రమించుకుంటూ కనీ విని ఎరుగని విధ్వంసాన్ని సృష్టిస్తున్న రోజులవి. ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితి. కూలిన ఇళ్లు, నిర్మానుష్యమయ్యే వీధులు, కుక్కలు తింటున్న మానవ కళేబరాలు, లేస్తున్న బాంబుల పొగ, కూలిన వంతెనలు, ధ్వంసమైన పొలాలు ఇవీ గ్రామాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. కానీ యుద్ధజ్వాలలు, మృత్యుభయాలు చైనా ప్రజలకు ఒక వినూత్నమైన జీవన శైలిని అలవాటు చేశాయి. ఒక వైపు చావులు, మరోవైపు చావును సవాలు చేస్తూ ఆటపాటలు, స్వాగత సత్కారాలు. వందల మైళ్ల ప్రయాణాలు చేస్తూ ఒక నగరం నుంచి ఇంకో నగరానికి వెళుతూ అక్కడ క్షతగాత్రులకు వైద్యం చేస్తూ కొన్నిరోజుల పాటు అక్కడే గడిపేది.హాంకో నగరం నుండి ఇంటికి రాసిన ఉత్తరంలో కొట్నీిస్‌ ఇలా పేర్కొన్నాడు. 'ఇక్కడ రోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంబులెన్స్‌ వాహనాల కొరత తీవ్రంగా ఉండటం వలన గాయపడిన సైనికులు ఆసుపత్రివరకూ నడుచుకుంటూ రావాల్సిందే. వారు ఇక్కడకు చేరుకునేటప్పటికి ఒక్కోసారి వారం రోజులు కూడా పడుతుంది. తీవ్రంగా గాయపడిన సైనికులు దారిలోనే మరణిస్తున్నారు. యుద్ధరంగం నుండి హాంకోకు రోజూ సగటున 800మంది గాయపడిన సైనికులు చేరుకుంటున్నారు. ఇక డాక్టర్ల, నర్సుల తదితర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇందువల్ల రోగులకు సరైన చికిత్స అందడం లేదు. ఒక్క అంగుళం ఖాళీ ప్రదేశం లేకుండా రోగులు చాపలు పరుచుకొని పడుకుంటున్నారు'.

హాంకో, కాంటన్‌ నగరాలు చూస్తుండగానే జపాన్‌ సైన్యం వశమయ్యాయి. హాంకోలో 17రోజులు, చుంగ్‌కింగ్‌లో రెండు నెలలు, ఇఛాంగ్‌లో 26రోజులు సైనిక ఆసుపత్రిలోనూ, రెడ్‌క్రాస్‌లోనూ భారత బృందం పనిచేసింది. హాంకోలో విప్లవనేత చౌ ఎన్‌ లై ని, చుంగ్‌కింగ్‌లో ఉన్నప్పుడే చైనా అధ్యక్షుడు విన్‌సేన్‌ను, మదామ్‌ ఛాంగ్‌ కై షేక్‌ను కలుసుకున్నారు. ఇక్కడ ఉన్నప్పుడే చైనా భాషలోకి తమ పేర్లను మార్చుకున్నారు. అప్పుడే కొట్నీస్‌కు ఖాచీ హువా (చైనా దేశపు సద్గుణ ధాముడు) అనే పేరు పెట్టారు. చుంగ్‌కింగ్‌లో ఉండగానే అంతకముందెన్నడూ చూడనంత తీవ్రమైన విమాన దాడిని వైద్య బృందం చూసింది. పునాదులతో సహా కూలిపోతున్న భవనాలను, ఒక యువతి ఒడిలో పాలు తాగుతున్న పసిపాప సజీవ సమాధిఇలాంటివే ఎన్నెన్నో విషాదాలు. నిరాయుధ పౌరులపై జరిగిన అతి భయంకర దాడి అది. అప్పటికి భారతీయ వైద్య బృందం చైనాలో అడుగుపెట్టి మూడు మాసాలైంది. ఇంతలో ఒక విషాద వార్త కొట్నీిస్‌కుచేరింది. 1938 డిసెంబర్‌ 28న కొట్నీిస్‌ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడన్నది ఆ వార్త. ఇంటికి వెళ్లమని సహచరులు చెబుతున్నా గుండెను రాయి చేసుకొని క్షతగాత్రులకు తన సేవలను కొనసాగించడానికే నిశ్చయించుకున్నాడు. ప్రాచీన నగరాలు, ప్రమాదకరమైన పర్వత సానువులు, సుందరమైన నదీ ప్రయాణాలు, భయంకరమైన చలి, ఓటమితో వెనక్కు తగ్గుతున్న చైనా దళాలు, వైద్యం కోసం మైళ్లతరబడి, రోజుల తరబడి నడిచి వస్తున్న సైనికులు, ప్రజలు, సామాన్యుల సాహసాలు, దేశభక్తి, అంతర్జాతీయ సంఘీభావంతో ఎన్నో దేశాల నుంచి వచ్చిన మేధావులతో పరిచయాలు - ఇలాంటి వైవిధ్యపూరితమైన అనుభవాల మధ్య సంక్షుభిత చైనా సమాజంలో డాక్టర్‌ కొట్నీస్‌ ఒకడుగా మారసాగాడు.

చైనాలో ఉన్న ఐదేళ్లలో జరిగిన ఘటనలు, అనుభవాలు, విషాదాలు ఒక ఎత్తు అయితే, తాము చేస్తున్న పనిలో పూర్తిగా విలీనం కావడం, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడటం, నిజాయితీగా చుట్టూ జరుగుతున్న సామాజిక పరిణామాలను అధ్యయనం చేయడం, నమ్మినదాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడం లాంటి కొట్నీస్‌లోని సుగుణాలు చైనా ప్రజలతో, సంస్కృతితో మమేకమయ్యేలా చేశాయి. కొట్నీస్‌ ఆ కాలంలో ఇంటికి రాసిన ఉత్తరంలో చైనాదేశపు సమకాలీన పరిస్థితులు తనపై చెరగని ముద్రవేశాయని, ప్రపంచంలో గొప్ప శక్తిగా ఆవిర్భవించిన కమ్యూనిజం గురించి బాగా తెలుసుకోవడానికి తన అనుభవాలు దోహదప డుతున్నాయని పేర్కొన్నాడు.ó

చివరి మజిలీ యానాన్‌

భారతీయ వైద్య బృందం వైద్య మహాయాత్రలో చివరి మజిలీ యానాన్‌. ప్రపంచంలోనే అతి ఎక్కువ బాంబుదాడులకు గురైన పట్టణమిది. చైనా విముక్తి పోరాటంలో కీలకమైన 8వ రూట్‌ సైన్యానికి, గెరిల్లా సామ్రాజ్యానికి రాజకీయ పరిపాలనా కేంద్రం ఇదే. యానాన్‌కు 15 కి.మీ దూరంలో ఉన్న ఒక గుహలో 200 పడకల ఆసుపత్రిని అప్పుడే నిర్మించారు. ఇక్కడే కొట్నీస్‌, డాక్టర్‌ బసు ఇద్దరూ వైద్యసేవలు అందించారు. మరో 80 కి.మీ దూరంలో కొండల మధ్య ఉన్న వైద్య కళాశాలలో పనిచేయడానికి డాక్టర్‌ ఛోల్కర్‌, డాక్టర్‌ ముఖర్జీలు వెళ్లారు. భారతీయ బృందానికి ఏర్పాటు చేసిన స్వాగత సభకు సాదాసీదా సైనిక దుస్తులతో ఉన్న మావో హాజరయ్యారు. భారతీయ వైద్యులతో వైద్యం చేయించుకోవడం కోసం సుదూర ప్రాంతాలనుంచి కూడా జనం వచ్చేవారు. నాలుగు మాసాలు గడిచేలోపే విపరీతమైన చలివల్ల వృద్ధులైన డాక్టర్‌ ఛోల్కర్‌, డాక్టర్‌ ముఖర్జీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. వారు స్వదేశానికి వెనుతిరగాల్సి వచ్చింది. పౌష్టికాహారం లేకపోవడం వల్ల తరువాతి రోజుల్లో బృంద నాయకుడు అటల్‌కు జబ్బుచేసింది. ఆయన కూడా భారత్‌కు వెనుతిరిగాడు.

చివరికి ఇద్దరు - గొప్ప స్నేహితులు

ఇలా యానాన్‌లో 9నెలలు గడిచాయి. చైనా వచ్చి సంవత్సరం అవుతోంది. ఇక స్వదేశం వెళ్లాల్సి ఉంది. కానీ, ఇంతలో జనరల్‌ ఛూటే నుండి పిలుపు వచ్చింది. మిగిలిన వైద్యులూ గుర్రాలు, కంచర గాడిదలు సహాయంతో గెరిల్లా యుద్ధరంగ కేంద్రమైన ఉసియాంగ్‌ చేరుకున్నారు. అక్కడ ఒక గుడిసెలో ఛూటేను కలిశారు. ఆ గెరిల్లా యుద్ధరంగంలో పూరిగుడిసెలే ఆసుపత్రి వార్డులు. అక్కడే ఆపరేషన్లు. గాయపడిన వారికి సకాలంలో, జాగ్రత్తగా, ఏ ఒక్క క్షతగాత్రుడు మిగిలిపోకుండా, తక్కువ మందులతో ఎక్కువ ఫలితాలు సాధించేలా వైద్యం చేయాలనేది వారు పెట్టుకున్న సూత్రం. కొట్నీస్‌, బసు రెజిమెంట్లతో పాటు కదిలిపోతూ యుద్ధరంగంలో సంచార వైద్యం చేయసాగారు. ఇంతలో వారికి డాక్టర్‌ బెతూన్‌ మరణ వార్త తెలిసింది. బెతూన్‌ స్థానంలో పనిచేయటానికై ఉతారుకి రావాల్సిందిగా కొట్నీస్‌కు ఆహ్వానం అందింది. ఇద్దరు మిత్రులు విడిపోవాల్సి వచ్చింది. డాక్టర్‌ కొట్నీస్‌కు మళ్లీ 1500 కి.మీ. ఆరునెలల ప్రయాణం. దారంతా గ్రామ ఆసుపత్రులను తనిఖీ చేయడం, సూచనలు ఇవ్వడం, వైద్యం చేయడం. మరోవైపు డాక్టర్‌ బసు రెండు నెలలపాటు కాలినడకన 600 కి.మీ నడిచి యానాన్‌ ఆసుపత్రికి చేరుకున్నాడు. అక్కడే ప్రధాన వైద్యుడిగా మళ్లీ విధులు నిర్వహించడం ప్రారంభించాడు.

ఆ విధంగా విడిపోయిన ఇద్దరు మిత్రులు మళ్లీ కలువనే లేదు. డాక్టర్‌ నార్మన్‌ బెతూన్‌ అంతర్జాతీయ శాంతి ఆసుపత్రిలో మొట్టమొదటి డైరెక్టర్‌గా కొట్నీస్‌ బాధ్యతలు స్వీకరించాడు. అక్కడ తన మనోభావాలను డాక్టర్‌ బసుకు ఉత్తర రూపంలో తెలియజేశాడు. క్షణం తీరిక లేకుండా ఉందని, నిఘంటువు అవసరం లేకుండానే చైనా పుస్తకాలు చదువుతున్నానని, శస్త్రచికిత్సలో తన కృషిలో తృప్తిగా ఉందని అందులో రాశాడు.యానాన్‌ రాకముందు విప్లవ పంథా పైన సరైన అవగాహన ఉండేది కాదని, బుర్రలో బూర్జువా భావాలు ఉండేవని, కానీ ఇప్పుడు గణనీయమైన పరివర్తన కలిగిందని రాశాడు. బెతూన్‌ ఆసుపత్రిలోనే చింగ్లాన్‌ ఆయనకు పరిచయం అయింది. ఆమె నర్సింగ్‌ విద్యాలయంలో ఒక ఉపాధ్యాయిని. వారిద్దరూ 1941 నవంబర్‌ 25న వివాహం చేసుకున్నారు. 1942 ఆగస్టు 23న వారికి ఒక మగబిడ్డ పుట్టాడు. అతనికి ఇంగ్‌హువా అనే పేరు పెట్టుకున్నారు. ఇంగ్‌ హువా అంటే అర్థం భారత్‌-చైనా అని. ఈ కాలంలోనే వైద్య విద్యార్థులకు శస్త్ర చికిత్స పాఠ్యగ్రంథాన్ని రాయడం ప్రారంభించాడు. 175 పేజీలు రాశాడు.

విశ్రాంతిని మరిచిపోయి నిర్విరామంగా వ్యాధులతో యుద్ధం చేస్తున్న డాక్టర్‌ కొట్నీస్‌కు మలేరియా సోకింది. మళ్లీ మళ్లీ తిరగబెట్టింది. దానికి తోడు మూర్చ పదేపదే రావడం ప్రారంభమైంది. జపాన్‌ దిగ్బంధనం వల్ల అవసరమైన మందులు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో వందలాది ప్రాణాలను కాపాడిన డాక్టర్‌ కొట్నీస్‌ 1942 డిసెంబర్‌ 9న తుదిశ్వాస విడిచాడు. మరణించేనాటికి కొట్నీస్‌ వయసు 32 సంవత్సరాలు. భారతదేశపుత్రుడు అంతర్జాతీయ దృక్పథంతో ఫ్యాసిస్టు వ్యతిరేక పోరాటంలో చైనా ప్రజల కోసం పోరాడుతూ చివరికి చైనా గ్రామంలోనే ఖననం చేయబడ్డాడు. కొట్నీస్‌ మరణించిన వార్త వారం రోజుల తరువాత డాక్టర్‌ బసుకు తెలిసింది. కానీ, ఆయన దాన్ని మొదట్లో నమ్మలేదు. కానీ నిర్ధారించుకున్న తరువాత 1943 ప్రథమార్థంలో భారతదేశానికి తిరిగి వచ్చేశాడు. కొట్నీస్‌ ప్రభావం ఎంతగా చైనాను తాకిందంటే 'కొట్నీస్‌ నుండి నేర్చుకోండి' అని చైనా అంతటా ఒక ఉద్యమంగా సాగింది. భారత దేశంలో కూడా కొట్నీస్‌ ఒక వైతాళికుడయ్యాడు. డాక్టర్‌ బసు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా ప్రఖ్యాత దర్శకుడు శాంతారామ్‌ 'కొట్నీిస్‌ కి అమర్‌ కహానీ' పేరుతో 1946లో విడుదలైన సినిమా బొంబాయిలో 27 వారాలపాటు ఆడింది. నిజానికి కొట్నీస్‌ జీవితం ఈనాటి యువకులకు ఒక గొప్ప సందేశాన్ని, స్ఫూర్తిని ఇస్తుంది. ఆచరణ ద్వారా ఒక వ్యక్తి జీవితంలో ఎంతటి మౌలిక మార్పులు వస్తాయో కొట్నీస్‌ నిరూపించాడు. అంతర్జాతీయ దృక్పథంతో ఇక్కడి ప్రజలకు సేవలందించిన డాక్టర్‌ రామచంద్రారెడ్డి, డాక్టర్‌ శేషారెడ్డి లాంటి వారి ఎందరికో డాక్టర్‌ కొట్నీస్‌ స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు. క్యూబా డాక్టర్లు నేటికీ ఈ అంతర్జాతీయతతోనే వివిధ దేశాల్లో సేవలు అందిస్తూ ఉన్నారు. కొట్నీస్‌ శతజయంతి సందేశాన్ని వైద్య కళాశాలల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.

(రచయిత జనవిజ్ఞానవేదికఆరోగ్య విభాగం రాష్ట్ర కన్వీనర్‌)('డాక్టర్‌ కొట్నీస్‌ జీవన జ్వాల' ఆధారంగా...).


  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com

Saturday, December 11, 2010

బి.ఆర్‌.అంబేద్కర్‌ డా., B.R.Ambedkar Dr.



భీంరావ్ రాంజీ అంబేడ్కర్ (Bhimrao Ramji Ambedkar) (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956)బాబాసాహెబ్ అని ప్రసిద్ధి, ధర్మశాస్త్రపండితుడు, భారత ప్రధాన రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, బౌధుడు, తత్వశాస్రవేత, అన్త్రోపోలోజిస్ట్, చరిత్రకారుడు, ప్రసంగికుడు, రచేయత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద ధర్మ పునరుద్ధరణకర్త.

భారత రాజ్యాంగ నిర్మాత డా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ తేది- 14-04 -1891వ సంవత్సరంలో మహర్‌ సామా జికవర్గానకి చెందిన భీమాబాయి, రాంజీ దంపతులకు జన్మించారు. గ్రామ నామాన్ని బట్టి అంబేద్కర్‌ ఇంటిపేరు ‘అంబావదేకర్‌’. అయితే అంబేద్కర్‌ను ఎంతో ఇష్టపడే తన ఉపాధ్యాయుడు అమిత వాత్సల్యంతో తన ఇంటిపేరు ‘అంబేద్కర్‌’ను ‘అంబావదేకర్‌’ స్థానంలో రాశారు. 1913లో బరోడా మహా రాజు ఉపకారవేతనంతో అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించారు. 1915లో అంబేద్కర్‌ రాసిన ‘ఎన్సియెంట్‌ ఇండియన్‌ కామర్స్‌’ అనే వ్యాసానికి ఎం.ఏ డిగ్రీ వరించింది. 1916లో ‘క్యాస్ట్‌‌స అండ్‌ దెయిర్‌ మెకానిజమ్‌, జెనెసిస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ అనే అంశంపై ఆంత్రో పాలజీ సెమినార్‌లో పలువురి ప్రశంసలు పొందారు అంబేద్కర్‌. ‘నేషనల్‌ డివిడెండ్‌ ఆఫ్‌ ఇండియా - ఎ హిస్టారికల్‌ అండ్‌ ఎనలిటికల్‌ స్టడీ’ అనే అంశంపై రాసిన పరిశోధనాత్మక గ్రంథానికి కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌.డి డిగ్రీ పొందారు. 1947- 51 మధ్యకాలంలో కేంద్ర మంత్రివర్గంలో న్యాయశాఖామంత్రిగా పనిచేశారు. జీవితాం తం కులనిర్మూలన, అట్టడుగు వర్గాల అభ్యు న్నతి కోసం అనేక ఉద్యమాలు చేపట్టిన సం ఘసంస్కర్త, దళితజన బాంధవుడు అంబేద్క ర్‌.

తన అమోఘ మేధాశక్తితో రాజ్యాంగాన్ని రచించిన భారత పరిపాలనా వ్యవస్థకు ఒక రూపాన్ని చేకూర్చిన మహనీయుడు. ఆయన సేవలను గుర్తిస్తూ... 1990లో భారత ప్రభు త్వం అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘భారతరత్న’ బిరుదినిచ్చి సత్కరించింది.



పూర్తి వివరాలకు --> అంబేద్కర్ బి.ఆర్.

========================================

Visit my website - > Dr.seshagirirao.com