Saturday, December 28, 2013

C.N.R.Rao,సి.ఎన్‌.ఆర్‌.రావు,చింతామణి నాగేశ రామచంద్రరావు

  •  
  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ - సి.ఎన్‌.ఆర్‌.రావు,చింతామణి నాగేశ రామచంద్రరావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

   

 ఏ అమెరికాలోనో పుట్టుంటే ఇప్పటికే నోబెల్‌ పురస్కారాన్ని అందుకునేవారేమో. కానీ భారతీయ విలువలూ ఆధ్యాత్మికత- ఆయనను గొప్ప శాస్త్రవేత్తగానే కాదు, గొప్ప మనిషిగానూ తీర్చిదిద్దాయి. సైన్సులోని మానవతాకోణం ...చింతామణి నాగేశ రామచంద్రరావు.

సైన్స్‌ - ఓ మహారణ్యమైతే , ప్రయోగశాల - ముని కుటీరం. సాయనాలూ గాజునాళికలూ...చెట్లూచేమలూ. డాక్టర్‌ సి.ఎన్‌.ఆర్‌.రావు - సైన్సు మహర్షి!

 శాస్త్రసాంకేతిక అంశాల్లో భారత ప్రధానికి సలహాలూ సూచనలూ అందించే అత్యున్నత స్థాయి నిపుణుల బృందానికి నాయకుడంటే ఓ పట్టాన నమ్మకం కలగదు. అంత నిగర్వి, అంత నిరాడంబర వ్యక్తి ...చింతామణి నాగేశ రామచంద్రరావు. ఆయన పరిశోధనలు రసాయనాలకో గాజు నాళికలకో పరిమితం కాలేదు ... ఏ భౌతిక రసాయన శాస్త్రం దగ్గరో, నానో పరిశోధనలతోనో ఆగిపోలేదు. సైన్సు జెండా భుజానికెత్తుకున్న ఉద్యమకారుడు రావుగారు. రేపటి తరాలకు సైన్సంటే మక్కువ కలిగించడానికి బడిబాట పట్టిన దార్శనికత్వం ఆయనది.

అచ్చమైన మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు రామచంద్ర. బాల్యమంతా బెంగళూరులోనే. నాన్న నాగేశరావు విద్యాశాఖలో ఉద్యోగి. అమ్మ నాగమ్మ ఎలిమెంటరీ స్కూలు దాకానే చదువుకున్నా..లోకజ్ఞానం మాత్రం అపారం. రామచంద్ర తొలిగురువు అమ్మే. ఒళ్లో కూర్చోబెట్టుకుని చెప్పిన రామాయణ భారత కథలూ, గోరుముద్దలు తినిపిస్తూ పాడిన పురందరదాసు కీర్తనలూ...తొలిపాఠాలు. నాన్నగారికేమో ఆంగ్లమంటే మక్కువ. ఏకాస్త సమయం దొరికినా... ఇంగ్లీషు నేర్పించేవారు. రామచంద్ర హైస్కూలులో ఉన్న సమయంలో... భారత స్వాతంత్య్ర పోరాటం ఊపందుకుంది. సుభాష్‌ చంద్రబోస్‌ ఆ కుర్రాడి ఆరాధ్య నాయకుడు. నేతాజీ వీరోచిత పోరాటాన్ని మిత్రులకు కథలుగా చెప్పేవాడు. పట్టుమని పదేళ్లు కూడా నిండకుండానే లోయర్‌ సెకెండరీ పరీక్షల్లో ఫస్టున పాసైనందుకు ... రామచంద్ర జేజమ్మ తన ముద్దుల మనవడికి రూపాయి కాసు కానుకగా ఇచ్చింది. డెబ్భై ఏళ్ల క్రితం రూపాయంటే... ఇప్పటి వేయి రూపాయలతో నమానం! దాన్ని జాగ్రత్తగా దాచుకుని, ఆతర్వాతెప్పుడో పుస్తకాలు కొనుక్కున్నాడు. పెరిగి పెద్దవుతున్నకొద్దీ స్వాతంత్య్ర ఉద్యమ తీవ్రతా పెరిగింది. ఎవరూ చెప్పకపోయినా...గాంధీటోపీ పెట్టుకున్నాడు, ఖద్దరు ధరించాడు. హైస్కూలు పెద్ద పరీక్ష పాసయ్యేనాటికి... దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఎటు చూసినా సంబరాలే. కానీ మైసూరు సంస్థానం మాత్రం ఇంకా మహారాజు పాలనలోనే ఉండేది. ఆ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ ప్రజాపోరాటం మొదలైంది. కౌమారంలోని ఆవేశం రామచంద్రనూ ఉద్యమంలోకి దింపింది. వీధుల్లో హర్తాళ్లు చేశాడు. వేదికలెక్కి ఉపన్యాసాలిచ్చాడు. అలా అని, చదువుని నిర్లక్ష్యం చేయలేదు. పదిహేడేళ్లకే బీఎస్సీ పట్టా అందుకుని మైసూరు విశ్వవిద్యాలయంలో కొత్త రికార్డు నెలకొల్పాడు. ఓ లెక్చరరు సలహా మేరకు, తనకు ఎమ్మెస్సీలో సీటివ్వమంటూ బెనారస్‌ హిందూ యూనివర్సిటీకి ఓ లేఖ రాశాడు. అక్కడ మాస్టర్స్‌ డిగ్రీ చదువుతూనే పరిశోధన చేసే వెసులుబాటు ఉండేది. ఆ ప్రత్యేకతే రామచంద్రను ఆకర్షించింది. వెంటనే బయల్దేరి రమ్మంటూ విశ్వవిద్యాలయ ప్రతినిధులు తంతి పంపారు. రామచంద్ర బెనారస్‌ బండి ఎక్కాడు. ఎటూ సైన్స్‌ విద్యార్థే కాబట్టి, హేతుబద్ధంగా ఆలోచించడం అతనికెవరూ నేర్పాల్సిన అవసరం రాలేదు. కానీ సైన్సు కంటే ఇంకాస్త ముందుకెళ్లి...ఆధ్యాత్మికత గురించి బోధించింది మాత్రం వారణాసి వాతావరణమే. గంగాస్నానం, విశ్వేశ్వరుడి దర్శనం, సాధుసంతుల సాంగత్యం - రామచంద్ర ఆలోచనలపై చాలా ప్రభావం చూపాయి. ఎమ్మెస్సీ పట్టాతో బెంగళూరుకు తిరిగొచ్చినా...ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో తన విభాగానికి సంబంధించి పెద్దగా పరిశోధన అవకాశాలు లేకపోవడంతో...పీహెచ్‌డీ కోసం ఖరగ్‌పూర్‌ ఐఐటీకి వెళ్లాడు.

ఖరగ్‌పూర్‌లో కఠోరశ్రమ చేస్తున్నా...అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తన పరిశోధన సాగడం లేదన్న అసంతృప్తి వెంటాడేది. అప్పుడే, ఓ ప్రొఫెసరుగారు 'నువ్వు అమెరికా ఎందుకు వెళ్లకూడదు?' అని సలహా ఇచ్చారు. అప్పటిదాకా రామచంద్రకు ఆ ఆలోచనే రాలేదు. పేరున్న విశ్వవిద్యాలయాలన్నిటికీ దరఖాస్తు చేశాడు. అన్నిచోట్లా సీటొచ్చింది. తను మాత్రం పర్‌డ్యూ విశ్వవిద్యాలయంలోనే చేరాలని నిర్ణయించుకున్నాడు. దిగ్గజాల్లాంటి ప్రొఫెసర్లు ఉన్నారక్కడ. తీరా బయల్దేరేముందు, కొన్ని అభ్యంతరాలు ఎదురయ్యాయి. ఆరోజుల్లో సంప్రదాయ కుటుంబాలవారు సముద్రయానం చేసేవారు కాదు. ఎలాగోలా కన్నవారిని ఒప్పించి...ఓడ ఎక్కాడు. ప్రయాణికులంతా ఆటపాటలతో కాలక్షేపం చేస్తుంటే, తను మాత్రం పుస్తకాలు ముందేసుకుని కూర్చునేవాడు. లేదంటే, ఆ అనంత జలనిధిని చూస్తూ...సృష్టిలోతుల్ని అర్థంచేసుకునే ప్రయత్నం చేసేవాడు. ఇరవై రోజుల ప్రయాణం తర్వాత న్యూయార్క్‌ నగరాన్ని చేరుకున్నాడు. కొత్త వాతావరణం, కొత్త భాష, కొత్త సంస్కృతి. అలవాటు పడటానికి కొంత సమయం పట్టింది. తన దృష్టంతా చదువుల మీదే ఉండటంతో... మరో ఆలోచన వచ్చేది కాదు. ఆరేడేళ్లకైనా కొలిక్కిరాని పరిశోధనల్ని రెండున్నర సంవత్సరాల్లో పూర్తిచేశాడు. అక్కడే తన అభిమాన గురువు లినస్‌ పాలింగ్‌ను కలుసుకునే అవకాశమూ వచ్చింది. రసాయనశాస్త్రంలో మరిన్ని పరిశోధనల దిశగా ప్రోత్సహించిందీ ఆయనే. ఆతర్వాత కాలిఫోర్నియా యూనివర్సిటీలో పైచదువులు చదివాడు. పోస్ట్‌ డాక్టొరల్‌ తర్వాత ... అమెరికాలో స్థిరపడాలా, మాతృదేశానికి తిరిగిరావాలా? అన్న ప్రశ్న. మరొకరైతే... ఇంకో ఆలోచన లేకుండా, ఏ అమెరికన్‌ యూనివర్సిటీలోనో చేరిపోయేవారు. నిజానికి, భారత్‌లో రసాయనశాస్త్ర పరిశోధకులకు పెద్దగా అవకాశాల్లేవు. కానీ రామచంద్ర వెనక్కి వచ్చేయాలనే నిర్ణయించుకున్నాడు. అప్పటికే అమెరికా రసాయనశాస్త్రంలో చాలాముందుంది. భారత్‌ అప్పుడే తొలి అడుగులు వేస్తోంది. మాతృదేశానికే తన అవసరం ఎక్కువని గ్రహించాడు. ఒక్కగానొక్క బిడ్డ కాబట్టి... అమ్మానాన్నలూ కొడుకు తిరిగిరావాలనే కోరుకున్నారు.

విదేశాల నుంచి రాగానే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)లో లెక్చరర్‌గా చేరారు రామచంద్ర. జీతం నెలకు ఐదు వందలు. అంత చదువు చదివీ అన్ని అర్హతలుండీ ... అంత చిన్న కొలువేమిటని బంధుమిత్రులు అడ్డుచెప్పినా పట్టించుకోలేదు. అప్పటికి భారత్‌లో ఎంతోకొంత ప్రతిష్ఠ కలిగిన సంస్థగా ఐఐఎస్‌సీ పేరు తెచ్చుకుంది. కానీ అక్కడ ప్రత్యేకంగా భౌతిక రసాయనశాస్త్ర పరిశోధనశాల లేదు. దానికితోడు ... అంతర్గత రాజకీయాలు, నిధుల కొరత. భౌతికశాస్త్రానికి ఓ పరిశోధనశాల ఉన్నా... అందులోకి రామచంద్రను అనుమతించలేదు. అదో రంపపు కోత! ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. 'చీకట్లో ఉన్నానని బాధపడుతూ కూర్చుంటే, ఫలితం లేదు. దీపం వెలిగించాలి. వెలుతురును ఆహ్వానించాలి' అని చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. అందుబాటులో ఉన్న నిధులతోనే చిన్న పరిశోధనశాల ఏర్పాటు చేశారు. టైటానియం డయాక్సైడ్‌పై పరిశోధనలు చేశారు. తన దగ్గరున్న ఆరుగురు పీహెచ్‌డీ విద్యార్థులతోనూ ప్రయోగాలు చేయించారు. ఆ అనుభవాలతో ఓ పుస్తకం రాశారు. లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక ముద్రణ సంస్థ దాన్ని విడుదల చేసింది. అప్పుడే, ప్రఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్‌ పరిచయం అయ్యారు. హైస్కూలు రోజుల్లో తొలిసారిగా రామన్‌ను చూశారు రామచంద్ర. ఆయనలోని వినయం, విజ్ఞానం రామచంద్ర వ్యక్తిత్వ నిర్మాణానికి ముడిసరుకుగా ఉపయోగపడ్డాయి. ఓసారి, తనే స్వయంగా వచ్చి.. రామచంద్రకు ఓ సైన్స్‌ జర్నల్‌ ఇచ్చి వెళ్లారు. 'నువ్వు రాసిన కెమికల్‌ అప్లికేషన్స్‌ ఆఫ్‌ ఇన్ఫ్రారెడ్‌ స్పెక్ట్రోస్కోపీ పుస్తకం చాలా బావుంది' అని ఉత్తరం రాశారు. మరో సందర్భంలో ... రామచంద్ర ఉపన్యాసాన్ని విని 'నువ్వో నిప్పు కణిక. మంచి భవిష్యత్తు ఉంది' అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

ఐఐఎస్‌సీలో మేధోపరమైన స్వేచ్ఛ ఉన్నా...పరిశోధనలకు అవకాశాలు తక్కువ. దీనివల్ల తన ఆలోచనలకు ఓ రూపం ఇవ్వలేకపోతున్నాననే బాధ వెంటాడేది. అప్పుడే, ఐఐటీ కాన్పూర్‌ నుంచి పిలుపు వచ్చింది. పరిశోధనల కోసం తగినన్ని వనరులు సమకూరుస్తామని యాజమాన్యం మాటిచ్చింది. ఓ శాస్త్రవేత్తగా, రసాయనశాస్త్ర అభిమానిగా ...రామచంద్ర తనను తాను నిరూపించుకోడానికి ఐఐటీ ప్రాంగణం ఓ వేదికైంది. మూడుపదులు నిండకుండానే ప్రొఫెసర్‌ స్థాయికి చేరుకున్నారు. 'వింటర్‌ స్కూల్‌' పేరుతో...దేశంలోని రసాయనశాస్త్ర బోధకులకు అంతర్జాతీయ నిపుణులతో పాఠాలు చెప్పించారు. రసాయనశాస్త్రం మీద విద్యార్థుల్లో ఆసక్తి పెంచడానికి ఓ న్యూస్‌లెటర్‌ ప్రారంభించారు. శిక్షణలో ఉన్న ఉపాధ్యాయుల కోసం, బాలల కోసం 'కెమిస్ట్రీ టుడే', 'అండర్‌స్టాండింగ్‌ ఇన్‌ కెమిస్ట్రీ' వంటి పుస్తకాలు రాశారు. 'నానో వరల్డ్‌'ను స్వీడిష్‌ భాషలోకీ తర్జుమా చేసుకున్నారు. కొంతకాలం విదేశాలకెళ్లి ...ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో రసాయనశాస్త్ర విజ్ఞానానికి మెరుగులు పెట్టుకుని వచ్చారు. అప్పుడే, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ డైరెక్టర్‌ సతీష్‌ధావన్‌ నుంచి ఓ ప్రతిపాదన వచ్చింది. 'మీరు బెంగళూరు రావాలంటే, ఏం చేయాలో చెప్పండి చాలు' అంటూ. రామచంద్ర పదవులు కోరుకోలేదు, పెద్ద జీతాలూ కోరుకోలేదు. అంతర్జాతీయ స్థాయిలో సాలిడ్‌ స్టేట్‌ కెమిస్ట్రీలో పరిశోధన సౌకర్యాలు కల్పిస్తే చాలన్నారు. ధావన్‌ సంతోషంగా అంగీకరించారు. ప్రత్యేక గ్రాంట్లు మంజూరు చేయించారు. కాస్త ఆలస్యంగా అయినా...అనుకున్నవన్నీ సమకూరాయి. ఆతర్వాత కొంతకాలానికి రామచంద్ర డైరెక్టరు స్థాయికి ఎదిగారు. ఐఐఎస్‌సీకి మహర్దశ మొదలైంది. నిధులొచ్చాయి, భవనాలొచ్చాయి, పరిశోధనశాలలొచ్చాయి. దేశంలోని మెరికల్లాంటి శాస్త్రవేత్తల్ని ఏరికోరి తెచ్చుకున్నారు రామచంద్ర. 'చాలా సందర్భాల్లో మనం వెనకబడిపోవడానికి కారణం నిధుల కొరతో, సౌకర్యాల లేమో కాదు - మనలోని నిర్లిప్తత, నిరాశావాదం. ముందు దాన్ని తరిమికొట్టాలి' అంటారాయన. అరవై ఏళ్లు నిండగానే... రామచంద్ర ఐఐఎస్‌సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మరో ఐదేళ్లు కొనసాగాలంటూ అభ్యర్థనలు వచ్చినా కాదన్నారు. పరిశోధనలకే పూర్తి సమయం కేటాయించాలని ఉందని స్పష్టం చేశారు. ఆ పదవికి మరో సమర్ధుడి పేరు సూచించారు. తన విజ్ఞానాన్నీ అనుభవాన్నీ రంగరించి, బెంగళూరు శివార్లలో జవహర్‌లాల్‌నెహ్రూ ఆధునిక విజ్ఞాన పరిశోధనా కేంద్రాన్ని స్థాపించారు. నిర్మాణశైలి నుంచి సైన్సు పరికరాల దాకా...అన్నీ తనే దగ్గరుండి చూసుకున్నారు. శాస్త్ర పరిశోధనలో, శిక్షణలో అంతర్జాతీయ శ్రేణి సంస్థగా తీర్చిదిద్దారు.

రామచంద్ర పరిశోధనలు రసాయనశాస్త్రంలో మైలురాళ్లు. సాలిడ్‌స్టేట్‌, స్ట్రక్చరల్‌ కెమిస్ట్రీ విభాగంలో ఆయన వెలుగులోకి తెచ్చిన వివిధ అంశాలు అనేక ఆవిష్కరణలకు కారణం అయ్యాయి. వైద్య, విద్య, పారిశ్రామిక రంగాల్లో కొత్త మార్పులకు దారిచూపాయి. నానో పదార్థాల రంగంలోనూ అపారమైన కృషి చేశారు. ప్రస్తుతం కృతక ఫొటో సింథసిస్‌ రసాయన విజ్ఞానంపై దృష్టి సారించారు. ఆరు దశాబ్దాల పరిశోధనా జీవితం తర్వాత కూడా...ఆయనలో కాస్తంతైనా అలసట లేదు. ఇప్పటికీ ఏవో పరిశోధనలు చేస్తుంటారు. 'ఓసారి నేను కేంబ్రిడ్జి ప్రొఫెసర్‌ నెవిల్‌మోట్‌ను కలవడానికి వెళ్లాను. ఆ సమయానికి ఆయన, పరిశోధన పత్రాల్లో అచ్చుతప్పులు సరిచేస్తూ కూర్చున్నారు. అప్పటికి ఆయన వయసు తొంభై ఒకటి. వయసును గెలవడం ఎలాగో ఆయన్ని చూసే నేర్చుకున్నాను' అంటారు. ఎనిమిదిపదులు దగ్గరపడుతున్నా...రామచంద్ర జ్ఞానకాంక్ష తీరలేదు. యువ విద్యార్థుల్ని చూడగానే యువకుడైపోతారు. కొత్త పుస్తకం కనిపించగానే విద్యార్థిగా మారిపోతారు.

రసాయనశాస్త్ర పాఠం చెప్పాలంటే, రామచంద్ర మాస్టారే చెప్పాలన్నంత పేరు తెచ్చుకున్నారు. ఆ శైలి చాలా వైవిధ్యం. సైన్స్‌ను కూడా సాహిత్యమంత ఆసక్తికరంగా బోధించడం ఆయనకే తెలుసు. 'విద్యార్థుల్ని రసాయనశాస్త్రం వైపు ఆకట్టుకోవాలంటే...మనం ఏం సాధించామన్నది కాదు, ఏం సాధించాల్సి ఉందో చెప్పాలి. వాళ్ల బుర్రలకు సవాలు విసరాలి' అంటారాయన. ఇప్పటికీ పాఠశాలలకు వెళ్లి... పిల్లలతో ముచ్చటిస్తుంటారు, సైన్స్‌ సంగతులు ఆసక్తికరంగా చెబుతుంటారు. విద్యార్థుల కోసం, పరిశోధకుల కోసం రామచంద్ర ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కొన్నిసార్లు విద్యార్థుల భోజనమూ అక్కడే. 'సగటు విద్యార్థితోనూ అద్భుతాలు చేయించగల గురువు ఆయన. రామచంద్రగారితో పదినిమిషాలు మాట్లాడినా చాలు.. పదేళ్లకు సరిపడా స్ఫూర్తిని పొందుతాం' అంటాడు పరిశోధక విద్యార్థి జాన్‌ థామస్‌. బిమన్‌ బాగ్చీ అనే సహచరుడిని రామచంద్ర యువ సైంటిస్టు అవార్డుకు ప్రతిపాదించారు. కానీ బాగ్చీ గడువులోపు అవసరమైన పత్రాల్ని సిద్ధంచేయలేకపోయాడు. దీంతో రావుగారే వాటిని ఢిల్లీకి తీసుకెళ్లి ఇచ్చారు. ఆయన ఓ పట్టాన విద్యార్థుల్ని మెచ్చుకోరు. ఇంకా ఇంకా పరిశోధించాలంటారు, ఇంకా ఇంకా సాధించాలంటారు. 'నాట్‌ బ్యాడ్‌' అన్నారంటే, 'వెరీగుడ్‌' అన్నంత సంబరం వాళ్లకు. ఆయన శిష్యుల్లో చాలామంది పద్మశ్రీలు అయ్యారు, భట్నాగర్‌ అవార్డు గెలుచుకున్నారు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకు తనే ఫీజులు కట్టారు, హాస్టలు బిల్లులు చెల్లించారు. 'ఉదయం పూట ఆయనతో నడకకి వెళ్లడానికి మేం పోటీపడేవాళ్లం. ఎన్నో విషయాలు ప్రస్తావనకు వచ్చేవి. ప్రతి మాటా ఓ అమూల్యమైన పాఠమే' అని గుర్తుచేసుకుంటాడు ప్రదీప్‌ అనే పూర్వ విద్యార్థి. 'గురువులను గౌరవించే దేశాలే అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. సైన్స్‌ ఉపాధ్యాయుల జీతాలు పెరగాలి. అప్పుడే తెలివైన యువతీయువకులు ఇటువైపు వస్తారు. ఆ విషయంలో ఫిన్‌లాండ్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. దక్షిణ కొరియా రెండో స్థానంలో ఉంది. భారత్‌ ఏ అడుగునో కనబడుతుంది' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు రామచంద్ర.

ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే...ఢిల్లీ పెద్దల దృష్టి రామచంద్ర మీద పడింది. దార్శనిక పత్రాలూ నివేదికలూ అవసరమైన ప్రతిసారీ ఆయన్ని పిలిపించేవారు. 'భారత ప్రభుత్వానికి సంబంధించినంతవరకూ సైంటిస్టుల ప్రతినిధి రామచంద్రగారే' అన్న కస్తూరి రంగన్‌ వ్యాఖ్య నూటికి నూరుపాళ్లూ నిజం. ఓసారి ఇందిరాజీ ఏదో పెద్ద పదవి ఇవ్వాలనే పిలిపించారు. రామచంద్ర అంగీకరించలేదు. 'నాకు సైంటిస్టుగా ఉండటమే ఇష్టం' అంటూ సున్నితంగా తిరస్కరించారు. 'పిలిచి పదవి ఇస్తానంటే వద్దని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మీరే' అన్నారట ఇందిరాగాంధీ. ఆ తరవాత, ఇందిర వారసుడిగా రాజీవ్‌గాంధీ అధికారంలోకి వచ్చారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రాన్ని జపించే యువ రాజీవ్‌కు రామచంద్ర ఆలోచనలు బాగా నచ్చాయి. రాజీవ్‌ హయాంలో రామచంద్ర నేతృత్వంలోని నిపుణుల బృందం దేశ శాస్త్రసాంకేతిక ప్రగతికి దిశానిర్దేశం చేసింది. విజన్‌-2020, టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌, దేశీయ సూపర్‌ కంప్యూటర్‌ - ఆ మేధోమధన ఫలితాలే. సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్స్‌ (సి-డాక్‌) కూడా రామచంద్ర నేతృత్వంలోని సలహామండలి ఆలోచనే. యూపీయే ప్రభుత్వ కీలక శాస్త్ర నిర్ణయాల వెనుకా .. ఆయన ఉన్నారు. రామచంద్ర దృష్టిలో సైన్స్‌ అంటే... రసాయనాలూ పరిశోధనలే కాదు. సువిశాల సమాజం కూడా. మన చుట్టూ ఉన్న అనేక సమస్యలకు సైన్స్‌లోనే పరిష్కారం ఉందని బలంగా విశ్వసిస్తారు. 'సైన్స్‌ తగ్గిపోయినకొద్దీ ఛాందసవాదం ప్రబలుతుంది. హేతువాదం కనుమరుగవుతుంది. మానవత్వం మట్టిపాలు అవుతుంది. ఛాందసవాదులు గాల్లో ఎగరాల్సిన విమానాల్ని మనుషుల మీదికి తోలేస్తారు' అని హెచ్చరిస్తారు. ఆమధ్య 'ఇజ్రాయెల్‌ నోబెల్‌'గా ప్రాచుర్యం పొందిన డాన్‌డేవిడ్‌ పురస్కారంతో పాటూ పది లక్షల డాలర్ల నగదు బహుమతినీ ఇచ్చారు. మరో ఆలోచన లేకుండా, రావుగారు ఆ భారీ మొత్తాన్ని జవహర్‌లాల్‌నెహ్రూ ఆధునిక విజ్ఞాన పరిశోధనా కేంద్రానికి విరాళంగా ఇచ్చారు.
రామచంద్ర బహుముఖ ప్రజ్ఞావంతులు. కళలు, సాహిత్యం, వర్తమాన అంశాలు - దేని గురించి అయినా అనర్గళంగా మాట్లాడగలరు. నెలకో కొత్త పుస్తకమైనా చదువుతారు. ఆయనలో లోతైన ఆధ్యాత్మిక భావాలున్నాయి. ద్వైతగురువు మధ్వాచార్యుల ప్రభావం అపారం. 'నేను దేవుణ్ని నమ్ముతానని చెప్పడానికి సంకోచించను. అలా అని, మూఢనమ్మకాల్లేవు. నేను విశ్వసించే దేవుడు సర్వవ్యాపకుడు, సర్వోత్తముడు, సర్వశక్తిమంతుడు. చాలా సందర్భాల్లో సమస్యల్ని ఎదుర్కోడానికి అవసరమైన నైతికశక్తి ఆధ్యాత్మికత ద్వారానే అందుతుంది' అంటారు. ధ్యానం, ప్రార్థన - హృదయ నేత్రాలని అభివర్ణిస్తారు.


పూర్తిపేరు : చింతామణి నాగేశ రామచంద్రరావు,
పుట్టిన తేదీ : జూన్‌ 30, 1934,
హోదా : భారత ప్రధాని శాస్త్ర సలహా మండలి అధ్యక్షుడు,,
చదువు : ఎమ్మెస్సీ (బెనారస్‌ హిందూ యూనివర్సిటీ), పీహెచ్‌డీ (పర్‌డ్యూ యూనివర్సిటీ), డీఎస్సీ (మైసూర్‌ యూనివర్సిటీ)
పరిశోధన : సాలిడ్‌స్టేట్‌, మెటీరియల్స్‌ కెమిస్ట్రీ, స్ట్రక్చరల్‌ కెమిస్ట్రీ
గౌరవ డాక్టరేట్లు : 51 విశ్వవిద్యాలయాల నుంచి.
పరిశోధన పత్రాలు : పదిహేను వందలకు పైగా.
రచనలు : దాదాపు యాభై పుస్తకాలు.
పీహెచ్‌డీ శిష్యులు : 150 మందికి పైగా,
ఆత్మకథ : క్త్లెంబింగ్‌ ద లిమిట్‌లెస్‌ ల్యాడర్‌ - ఎ లైఫ్‌ ఇన్‌ ద కెమిస్ట్రీ ,,
అవార్డులు : భారతరత్న సాధించిన మూడో శాస్త్రవేత్త. పద్మశ్రీ, పద్మవిభూషణ్‌,ఇండియన్‌ సైన్స్‌ ప్రైజ్‌, ఆర్డర్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌ (రష్యా), రాయల్‌ సొసైటీ క్వీన్స్‌ మెడల్‌ (లండన్‌), ఇంటర్నేషనల్‌ సైన్స్‌ కోఆపరేషన్‌ అవార్డు (చైనా), లేజియన్‌ ఆఫ్‌ ఆనర్‌ (ఫ్రాన్స్‌).
నినాదం : అందరికీ సైన్స్‌ - అందరి కోసం సైన్స్‌.

రావుగారింట్లో సరస్వతీ కళ తాండవిస్తుంది. అర్ధాంగి ఇందుమతి పెళ్లినాటికే ఆంగ్లసాహిత్యంలో ఆనర్స్‌ చేశారు. ఆతర్వాత, పరిశోధన చేసి డాక్టరేట్‌ సాధించారు. బోధన వృత్తిలో మంచిపేరు తెచ్చుకున్నారు. ఇద్దరికీ సంగీత సాహిత్యాలంటే ప్రాణం. హిందుస్థానీ క్లాసిక్స్‌ను హాయిగా ఆస్వాదిస్తారు. కాలక్షేపం కబుర్లతో కాలాన్ని వృథా చేయడం ఇద్దరికీ ఇష్టం ఉండదు. 'మౌనం ద్వారానే ఒకర్నొకరు బాగా అర్థంచేసుకున్నాం' అంటారా దంపతులు. పిల్లలు సుచిత్ర, సంజయ్‌ల పెంపకం బాధ్యత ఇందుమతిదే. పెళ్లిళ్లకూ శుభకార్యాలకూ తనొక్కరే వెళ్లేవారు. 'మా పెళ్లికీ పిల్లల పెళ్లికీ తప్పించి ఏ పెళ్లికీ ఆయన రాలేదు' అని నవ్వుతూ ఫిర్యాదు చేస్తారామె. 'నా జీవితానికి రెండే లక్ష్యాలు- ఒకటి, పరిశోధన పత్రాలు ప్రచురించడం. రెండు, నా భార్యను సంతోషపెట్టడం' అంటూ ఎదురుబాణం వేస్తారు రావుగారు. 

Courtesy with : sunday magazine@eenadu news pepar
  • ======================================== 
Visit my website - > Dr.seshagirirao.com/