ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళ ఆమె. అంతేకాదు, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌కు ఛైర్‌పర్సన్ కూడా. విధానసభ సభ్యురాలిగా, హర్యానా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఆ మహిళ పద్మశ్రీ సావిత్రీ జిందాల్. తన గురించి తాను ఏం చెబుతున్నారంటే...
హర్యానాలోని హిసార్ మా స్వస్థలం. 1970లో ఒ.పి.జిందాల్‌తో నా పెళ్లి జరిగింది. అప్పటి నుంచీ కుటుంబమే నా ప్రపంచంగా మారిపోయింది. భార్యగా, తల్లిగా ఎంతో సంతోషంగా నా బాధ్యతలు నిర్వర్తించాను. నలుగురు అబ్బాయిలూ, అయిదుగురు అమ్మాయిలను పెంచి పెద్దచేసినా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. బయటి విషయాలూ, వ్యాపార లావాదేవీలన్నీ ఆయనే చూసుకునేవారు. పిల్లలూ, ఇంటికి వచ్చిపోయే బంధువులూ... ఇదే నా లోకం. 2005లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించేంతవరకూ మాకున్న ఆస్తిపాస్తులు ఏమిటో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత నా ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. ఆయన తదనంతరం ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో వ్యాపార లావాదేవీలకు నేను పూర్తిగా కొత్త కావడంతో మా నలుగురు అబ్బాయిలు పృథ్విరాజ్, సజ్జన్, రతన్, నవీన్‌లే అన్ని విషయాలూ చూసుకునేవారు. నేను బోర్డు మీటింగులకూ, వాటిలో తీసుకునే నిర్ణయాలకూ చాలా దూరంగా ఉండేదాన్ని. వూపిరి సలపని వ్యాపార వ్యవహారాలకు దూరంగా ఉండటానికి రాజకీయాల నెపంతో మూడు రోజులు
హిసార్ నియోజకవర్గంలో గడిపేదాన్ని. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే ఒకప్పుడు అంత టెన్షన్ పడ్డానా అని నాకే నవ్వొస్తుంటుంది. ఇప్పుడు నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. బోర్డు మీటింగుల్లో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాను.
* ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారరంగాన్ని ప్రోత్సహించడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు. వివిధ వస్తువుల ఉత్పత్తిని పెంచడం ద్వారా ధరలనూ నియంత్రించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితులు వ్యాపార రంగానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయి. మనదేశంలో ప్రముఖ వ్యాపారాలన్నీ కొన్ని కుటుంబాలకే పరిమితం అయ్యాయి.
అలాకాకుండా వ్యాపారం చేయాలనుకునే ఉత్సాహవంతులకు ప్రోత్సాహకర పరిస్థితులు కల్పించాలి. అప్పుడు స్వయం ఉపాధికి అవకాశాలూ పెరుగుతాయి.
* విద్య, ఉద్యోగ, ఆరోగ్య రంగాల్లో మా సంస్థలు ఎంతోకాలంగా సేవలందిస్తున్నాయి. 2007లో ఒ.పి.జిందాల్ కమ్యూనిటీ కాలేజీని స్థాపించాం. దీంట్లో వృత్తి
విద్యా కోర్సుల్లో శిక్షణ అందిస్తాం. ఒకవ్యక్తి సొంతంగా వ్యాపార సంస్థను ప్రారంభించడానికి కావాల్సిన శిక్షణంతా ఇక్కడ లభిస్తుంది. ప్రతిభ కనబరిచినవారికి స్కాలర్‌షిప్ సౌకర్యమూ ఉంది.
* సుమారు యాభైమూడు వేలకోట్ల రూపాయల సంపదతో దేశంలోని సంపన్నుల్లో ఏడో స్థానం పొందాను. ప్రపంచ సంపన్నుల్లో యాభైఆరో స్థానం సాధించడం, ఇంకా ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా ఎంపిక కావడమూ సంతోషంగానే ఉంది. అయితే, ఇవేమీ నా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పులూ తీసుకురాలేదు. నేను ఒకప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. నిరాడంబరంగా జీవించడానికే ఇష్టపడతాను. నేను పగ్గాలు
చేపట్టిన తర్వాత సంస్థ ఆదాయం మూడు రెట్లు పెరిగిందని మాత్రం కాస్త గర్వంగానే చెప్పగలను.
* ఒ.పి. జిందాల్ గ్రూప్ సంస్థ 1952లో ప్రారంభమైంది. అత్యధికంగా ఇనుమును ఉత్పత్తిచేసే సంస్థల్లో ప్రపంచంలోనే ఇది మూడోది. దీంట్లో స్టీల్, పవర్, మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్‌కు సంబంధించిన నాలుగు విభాగాలున్నాయి. నలుగురు అబ్బాయిలూ ఒక్కొక్కరూ ఒక్కో విభాగ బాధ్యతలు చేపట్టారు. అయితే, ఎవరికి ఏ సమస్య వచ్చినా నలుగురూ ఒకచోట కూర్చుని జాగ్రత్తగా చర్చించిమరీ నిర్ణయాలు తీసుకుంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తామంతా అన్నదమ్ములమేనన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోరు. ఇదంతా తండ్రి నుంచి వచ్చిన క్రమశిక్షణే. నా పిల్లలకు కుటుంబ వారసత్వంగా ఆస్తిపాస్తులే కాదు, నీతి నిజాయతీలూ, కష్టపడేతత్వం, చక్కటి వ్యక్తిత్వం కూడా వచ్చాయి.
* బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తించడంలోనే నిజమైన ఆనందం దొరుకుతుంది. మా ఉద్యోగులను కేవలం ఉద్యోగుల్లా చూడను, కుటుంబ సభ్యుల్లానే చూస్తాను. వారి సమస్యలను శ్రద్ధగా వింటాను. 'కుటుంబం అంటే నువ్వూ, నేనూ, పిల్లలు మాత్రమేకాదు, మన ఉద్యోగులు కూడా' అని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. ఆ మాటలను నేను ఎప్పటికీ మర్చిపోను.
* నేటి మహిళా వ్యాపారవేత్తలకు నేను చెప్పేది ఒక్కటే.. కష్టపడి పనిచేయండి. శ్రమజీవికి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మార్కెట్లో గట్టి పోటీ ఎదురైనా, అవరోధాలు కలిగినా బెదిరిపోకండి. వ్యాపార ప్రపంచంలో అవన్నీ సహజం. ధైర్యంగా ముందడుగు వేస్తే ఫలితం ఎప్పుడూ మీకు అనుకూలంగానే ఉంటుంది.
*అభిరుచుల విషయానికి వస్తే... సాంఘిక సేవా కార్యక్రమాల్లో ఇష్టంగా పాల్గొంటాను. ఏకాస్త సమయం దొరికినా పుస్తకాలు చదువుతాను, పిల్లలకు కమ్మగా వండిపెడతాను.
- =========================
No comments:
Post a Comment
Thanks for your comment & feedback.