Thursday, March 14, 2013

Kalojii Narayanarao, కాళోజీ నారాయణరావు

  •  


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Kalojii Narayanarao, కాళోజీ నారాయణరావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


తెలంగాణ తొలిపొద్దు కాళోజీ!-‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యా యం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం, బిజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించిన కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్న డ, ఇంగ్లిష్ భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారు. రాజ కీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి. బిజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది.

ప్రాథమిక విద్యానంతరం హైదరాబాద్ పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజ్‌లోనూ, హనుమకొండలోని కాలేజియేట్ హైస్కూల్‌లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. 1939లో హైదరాబాద్‌లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించారు. నిజామాంధ్ర మహా సభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌తో కాళోజీ అనుబంధం విడదీయరానిది.

మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామ్‌కిషన్‌రావు, పీవీ నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ సామాన్యుడే నా దేవుడని ప్రకటించిన కాళోజీ 2002 నవంబర్ 13న తుదిశ్వాస విడిచారు.

-దొమ్మాట వెంకటేశ్ హైదరాబాద్-(నేడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు పదవ వర్థంతి) @http://www.sakshi.com/

=========================
Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.