మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -- Ram manohar Lohiya,రామ్‌మనోహర్ లోహియా- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
సామ్యవాద స్వాప్నికుడు!నిర్భీతికి, నిజాయితీకి చిరునామా గామారి సమాజ శ్రేయస్సుకై తుది శ్వాస దాకా పరితపించిన విలక్షణ రాజకీయవేత్త రామ్‌మనోహర్ లోహియా. స్వాతంత్య్ర సంగ్రామం లో అతి కీలకఘట్టమైన క్విట్ ఇండి యా ఉద్యమంలో ఉద్ధండులైన నేతలందరూ నిర్భంధానికి గురైన సందర్భంలో, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ వంటి నాయకులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేయడంలో లోహియా నిర్వహించిన పాత్ర అనన్యం. 1910 మార్చి 23న ఉత్తరప్రదేశ్‌లోని అక్బర్‌పూర్‌లో సంపన్నుల ఇంట జన్మించిన లోహియా ఆడంబరాలకు దూరంగా జీవించారు. కష్టపడటంలోనే తృప్తి ఉందన్నది లోహియా సిద్ధాం తం. బెర్లిన్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా సాధించినప్పుడు కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరం గాంధీ అనుచరుడుగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నప్పటికీ భగత్‌సింగ్, సుభాష్‌చంద్రబోస్ వంటి విప్లవవాదుల ప్రభావం లోహియాపై ఉంది. దేశానికి స్వాతంత్య్రం వస్తేచాలన్న పరిమిత లక్ష్యానికి లోహియా ఎన్నడూ లోనుకాలేదు.
ప్రపంచ దేశాల్లోని అన్ని జాతుల విముక్తితోపాటు వర్ణ వివక్ష పూర్తిగా రూపుమాసినప్పుడే, మానవాళి సంపూర్ణంగా వికసించడం సాధ్యమని నమ్మిన క్రాంతదర్శి. స్వాతంత్య్రానంతర భారతదేశాన్ని గురించి లోహియా ఎన్నో కలలుకన్నాడు. దేశ భవి ష్యత్తుకూ, దారిద్య్ర నిర్మూలనకూ ‘ప్రజాస్వామిక సామ్యవాద’ సాధనే మార్గమని భావించిన నేత లోహియా. గాంధీ, మార్క్స్‌లను ఎంతగా అభిమానించినప్పటికీ, వారి సిద్ధాంతాలను మాత్రం లోహియా యథాతథంగా అంగీకరించకపోవడం గమనార్హం. ‘గాంధీ-మార్క్స్ అండ్ సోషలిజం’ అన్న తన ప్రసిద్ధ గ్రంథంలో, తన భావాన్ని మరింత లోతుగా వివరిం చారు. భారత రాజకీయాల్లో ‘తృతీయశక్తి’ అన్న భావనకు, ఆచరణ రూపాన్ని కల్పిం చిన ఘనత లోహియాకే సొంతం.
దేశంలో సోషలిస్టు ఉద్యమ నిర్మాణానికి నడుంబిగించడమే కాక, అంటరానితనానికి, కులవివక్షకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు సాగించారు. స్వదేశీ సంస్థానాల విలీనం, గోవా విమోచనోద్యమంలో లోహియా నిర్వహించిన పాత్ర ఎంతో కీలకమైనది. ఆంగ్ల భాషా వ్యతిరేకోద్యమం సహా నేపాల్ రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటంలో లోహియా గణనీయమైన కృషిని సాగించారు. రాజకీయ జీవితాచరణలో విలువలకు పట్టంగట్టిన రామ్‌మనోహర్ లోహియా 1967 అక్టోబర్ 12న ఢిల్లీలోని విల్లింగ్టన్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన జ్ఞాపకార్థం, ఆ ఆసుపత్రి పేరును ‘డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రి’గా నామకరణం చేశారు. మరణానికి ముందు తన చుట్టూ గుమిగూడిన వైద్యులను ఉద్దేశించి లోహియా అన్న మాటలు మరువలేనివి-‘‘ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలకు డాక్టర్ల రూపురేఖలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. అలాంటిది, నా కోసం ఇంత మంది డాక్టర్లా!’’ అంటూ కన్నీరు కార్చడం ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి అద్దం పట్టడమే కకా, నేటికీ మన పాలకులకు అదొక హెచ్చరికగా మిగిలిపోయింది.
లెక్కల వెంకటరెడ్డి లెక్కలవారి పల్లె, వైఎస్సార్ కడప జిల్లా-(నేడు రామ్‌మనోహర్ లోహియా 45వ వర్థంతి)@ http://www.sakshi.com/
- =========================