Saturday, November 20, 2010

ఎన్‌.జి.రంగా , N G Ranga,ఆచార్య ఎన్‌.జి.రంగా


ఆచార్య ఎన్‌.జి.రంగా : దేశంలో సుదీర్ఘకాలం పార్లమెంట్‌ సభ్యునిగా పనిచేసి, ఎటువంటి పదవి ఆశించకుండా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన తుది శ్వాస విడిచేంత వరకు అవిశ్రాంత పోరాటం జరిపిన మహౌన్నతుడు ఆచార్య ఎన్‌.జి.రంగా, రైతుల పక్షాన చట్టసభలలో తన వాణిని వినిపించి, పాలక పక్షాలు వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను గుర్తించే విధంగా ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. ఆయన చేనేత కార్మికుల, వ్యవసాయ కూలీల జీవితాలలో వెలుగులు నింపడానికి ఆవిరళ కృషి సల్పారు. దేశంలో రైతాంగ ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచి, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అయ్యేలా విశేషంగా ప్రయత్నించారు. దేశంలో తొలిసారిగా వ్యవసాయ రుణాలపై మారటోరియం ప్రకటించడానికి ఆద్యుడు ఎన్‌.జి.రంగానే.

ఆయన నిడుబ్రోలులో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకు 1900 నవంబర్‌ 7వ తేదీన జన్మించారు. ఆయన అసలు పేరు గోగినేని రంగనాయకులు. అనంతరం ఎన్‌.జి.రంగాగా సుప్రసిద్ధులయ్యారు. ఇరవై ఏళ్ళ వయస్సులో ఉన్నత చదువుల కోసం ఇంగ్లాడ్‌ వెళ్ళారు. మూడేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన రంగా కాంగ్రెసు పార్టీవైపు ఆకర్షితులై ఆ పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. 1924లో భారతీదేవితో రంగా వివాహం జరిగింది. ఆనంతరం 1927లో మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో ఆర్ధిక శాస్త్ర అధ్యాపకునిగా, అనంతరం మద్రాసు ప్రభుత్వ ఆర్ధిక సలహాదారునిగా కొంత కాలం పనిచేశారు. 1930లో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌లతో సన్నిహితంగా మెలుగుతూ స్వాతంత్య్ర సంగ్రామంలో విజృంభించారు. 1931లో భూమి శిస్తుకు వ్యతిరేకంగా ఉద్యమించిన రంగాను బ్రిటీషు ప్రభుత్వం అరెస్టు చేసింది. అరెస్టులకు బెదరని రంగా రైతుల దుర్భర పరిస్ధితులకు వ్యతిరేకంగా రైతు రుణ విముక్తి ఉద్యమాన్ని ప్రారంభించి, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమ ఫలితంగానే బ్రిటీష్‌ ప్రభుత్వం ఆనాడు రైతుల రుణాలపై మారటోరియంను ప్రకటించింది. అప్పటి నుంచి రైతు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ రంగా ప్రత్యక్షమై ఉద్యమాలను నిర్వహించేవారు. యువతకు రాజకీయాలు నేర్పడానికి పాఠశాలను స్ధాపించిన ఘనత ఆచార్య ఎన్‌.జి.రంగాకే దక్కింది. దేశంలోనే తొలిసారిగా ఆయన నిడుబ్రోలులో రామనీడు పేరుతో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడానికి సమర్ధులైన నాయకులను రాజకీయాల్లోకి తేవడమే లక్ష్యంగా 1933వ సం.లో రంగా స్ధాపించిన రాజకీయ విద్యాలయాన్ని మహాత్మాగాంధి ప్రారంభించడం విశేషం. రాష్ట్రం, దేశం నుంచి విద్యాలయానికి విచ్చేసి రాజకీయంగా ఓనమాలు నేర్చుకున్న నాయకులు ఎందరో సమర్ధులైన నాయకులుగా పేరు ప్రఖ్యాతులు గడించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా, మంత్రులుగా, ఎమ్మెల్యే పదవులను చేపట్టి రాణించారు. ప్రస్తుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కూడా రంగా శిష్యుడే. రంగా స్పూర్తితో ఇతర రాష్ట్రాల్లో కూడా రాజకీయ విద్యాలయాలను నిర్వహించారు. ఈ పాఠశాల స్మృతులకు సజీవ సాక్ష్యంగా నేటికి నిడుబ్రోలులో కొనసాగుతుంది. రంగా రైతుల ప్రతినిధిగా పార్లమెంటులో ప్రవేశించి తమ వాణిని వినిపించారు. అప్పటినుంచి విజయ పరంపర సాగిస్తూ...సుదీర్ఘ కాలం పార్లమెంట్‌ సభ్యునిగా రికార్డు సృష్టించి,గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కారు. చిత్తూరు, శ్రీకాళహస్తి, గుంటూరు లోక్‌సభ నియోజక వర్గాల నుంచి ఎన్నికై ఆయన ప్రాతినిధ్యం వహించారు. 95 సంవత్సరాల వయస్సులో ఆయన అనారోగ్యంతో 1995 జూన్‌ 8వతేదీన నిడుబ్రోలులోని ఆయన స్వగృహమైన గోభూమిలో తుదిశ్వాస విడిచారు. రంగా మరణంతో భారత రాజకీయ వినీలాకాశం నుంచి ఓ ధృవతార రాలిపోయిందని జాతీయ, అంతర్జాతీయ స్ధాయి నాయకులు తమ సందేశాల్లో కొనియాడటం విశేషం.


========================================
Visit my website - > Dr.seshagirirao.com

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.