Saturday, July 27, 2013

Jayadevudu , జయదేవుడు




మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Jayadevudu , జయదేవుడు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



జయదేవుని తల్లిదండ్రులు భోజదేవ, రమాదేవీ. వీరు కనౌజ్‌ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ దంపతులు. ఉద్యోగాన్ని వెదుక్కుంటూ జయదేవుడి తండ్రి భోజదేవుడు తన భార్యతో సహా కెండులిని చేరాడు. అక్కడే వారికి జయదేవుడు జన్మించాడు. ఐతే జయదేవుడు పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాధ అయ్యారు. కానీ ధైర్యాన్ని వదులుకోకుండా ఎంతో పట్టుదలతో సంస్కృతం నేర్చుకుని నైపుణ్యత గల కవిగా తయారయారు జయదేవుడు. స్వతహాగా శ్రీకృష్ణ భక్తుడైన జయదేవుడు ఇహ లోక జీవితంపై అంతగా ఆసక్తిని కనబరచలేదు. కృష్ణ్ణలీలను గానం చేస్తూ చాలా సంవత్సరాలు అనేక స్థలాలను తిరుగుతూ బెంగాలుకు దక్షిణం వైపున ఉన్న ఒరిస్సాలోని జగన్నాధపురిని చేరాడు. పూరి జగన్నాధుడిని సేవించాడు. చేతిలో పిల్లనగ్రోవిని ధరించిన శ్రీకృష్ణుణ్ణి జయదేవుడు దర్శించాడు. ఆ తరువాత ఇతడు విష్ణువు ఇతర అవతారాలైన దశావతారాలను దర్శించాడు.

పూరిలోని సుదేవశర్మ అనే పురోహితుడు జయదేవుడి జీవితానికి ఒక మలుపును ఇచ్చాడు. దాంతో అతడి జీవితమే మారిపోయింది. భగవత్‌ సన్నిధిలో నృత్యం చేసే తన అందాల రాశి కూతురు పద్మావతితో జయదేవుడి పెళ్లిని సుదేవశర్మ జరిపించాడు. మొదట్లో తాను వ్రతం చెడని సన్యాసినని... పెళ్లి వద్దని జయదేవుడు మొరాయించాడు. జగన్నాధుడే తనకు కలలో కనిపించి తన కూతురు పెళ్లిని నీతో చెయ్యమని ఆదేశించాడు అని సుదేవశర్మ చెప్పడంతో జయదేవుడు తమ మనసును మార్చుకున్నాడు. తన కవితకు కావలసిన స్ఫూర్తిని జయదేవుడు తన అందాల రాశి భార్య పద్మావతిలో చూసాడు. కెండులి గ్రామానికి భార్యతో తిరిగివచ్చి భార్యాభర్తలు తమ కాలాన్ని అక్కడే గడిపారు. అక్కడే...ఆ ప్రాంతంలో జయదేవుడు విశ్వవిఖ్యాతమైన గీతగోవిందం రచనకు పూనుకున్నాడు. గోపాల కృష్ణుడికి బృందావనంలోని రాధ పట్ల ఉన్న ప్రేమను ఈ కావ్యం వ్యక్తపరుస్తుంది. ఇందులో మొత్తం 24 అష్టపదులున్నాయి. ప్రతి అష్టపదినీ ఒక ప్రత్యేక రాగంతో, ప్రత్యేక తాళాన్ని అనుసరించి శాస్ర్తీయ బాణీలో జయదేవుడు రచించారు.

జయదేవుడు భక్తిపారవశ్యంతో రాస్తున్నప్పుడు పద్మావతి నృత్యాభినయం చేస్తూ తన భర్తకు స్ఫూర్తినిచ్చేదట. ఐతే ఆఖరి దశలో అతని ఘంటం ముందుకు సాగలేకపోయింది. అష్టపదిలోని ఆఖరి రెండు చరణాలను జయదేవుడు విశ్వ ప్రయత్నం చేసినా రాయలేకపోయారు. నిరుత్సాహంతో ఆయన నదీ స్నానానికి వెళ్ళారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆ రెండు చరణాలను పూర్తిచేశారన్న కథ ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఆ చరణాలను పూర్తి చేసిన తరువాత పద్మావతి తన భర్త కోసం చేసిన అన్నం తిని కృష్ణుడు బయటకి వెళ్ళారట. స్నానం చేసి తిరిగివచ్చిన జయదేవుడు జరిగిన విషయం తెలుసుకుని ఉప్పొంగిపోయారు.... ఈ రోజు గీతగోవిందం దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉంది. ఒరిస్సా, బెంగాలు, దక్షిణ భారత దేశపు భక్తి సంగీతంలో గీతగోవిందం చోటుచేసుకుంది. కేరళలోని అనేక దేవాలయాల్లో అష్టపదుల గానం ఈ రోజుకూ జరుగుతూనే ఉంటుంది. ప్రపంచ సాహిత్య కళాఖండంగా గీతగోవిందం పరిగణించబడుతోంది.

  •  ==============================
 Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thanks for your comment & feedback.